//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముగిసిన సోనియా శకం !

Category : national

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ(47) పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. 19 ఏళ్ల పాటు ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా బాధ్యతలు నిర్వర్తించారు. సోనియా నేతృత్వంలో రెండుసార్లు యూపీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కుమారుడికి బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆమె రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో మీడియా ముందు సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, సోనియా భర్త రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఏడేళ్లు రాజకీయాలకు దూరంగా ఇందిరా గాంధీ కుటుంబం ఉంది. ఆ తర్వాత సోనియా రాజకీయాల్లోకి వచ్చారు. పంతొమ్మిది ఏళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా బాధ్యతలు నిర్వహించారు. గత కొద్దిరోజులుగా సోనియా ఆరోగ్యం సహకరించడం లేదు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టవలసి ఉంది. కానీ విదేశీయురాలు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో, బీజేపీ సహా పలు పార్టీలు విమర్శలు చేయడంతో ఆమె తగ్గారు. దీంతో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. 185 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రం రాకముందు కొంతమంది విదేశీయులు అధ్యక్షులుగా ఉన్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక తొలి విదేశీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

రాహుల్ గాంధీ రేపు (శనివారం) అధికారికంగా పార్టీ పగ్గాలు చేపట్టనుండగా.. పార్టీ శ్రేణులు అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. 16వ తేదీన ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ నియామక ఉత్తర్వులు అందుకుంటారని కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ ఎం.రామచంద్రన్‌ ఇటీవల తెలిపారు. రాహుల్ పట్టాభిషేకానికి సోనియాగాంధీ సహా అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ ప్రముఖులు హాజరు కానున్నారు.

అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలైన మొత్తం 89 నామినేషన్లు రాహుల్‌కు అనుకూలంగా వచ్చాయి. రాహుల్‌ ఒక్క నామినేషన్‌ మాత్రమే ఉండటంతో అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల వెల్లడికి రెండు రోజులు ముందుగా రాహుల్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండటం విశేషం.