అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఇప్పుడు సోషల్ మీడియా ప్రధాన ఆయుధంగా మారింది. ట్రంప్ సంధిస్తున్న ట్వీట్ల ధాటికి బడా మీడియా సంస్థలు కూడా లబోదిబోమంటున్నాయి. ఇటీవల ఎంఎస్ఎన్బీసీ టీవీ ప్రజెంటర్లపై ట్రంప్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.
ట్రంప్‌కు ట్విట్టర్లో దాదాపు 34 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తన ఫాలోవర్లకు ట్వీట్స్‌తో ఎప్పటికప్పుడూ షాక్ ఇస్తున్న ట్రంప్ అదే తీరుగా విమర్శలకు కూడా గురవుతున్నారు. రాజకీయ పండితులు, విశ్లేషకులు మాత్రం ట్రంప్ ట్వీట్ విధానాన్ని తప్పుపడుతున్నారు. అత్యున్నత పదవిలో ఉన్న ట్రంప్ కేవలం 140 అక్షరాలతో చేస్తున్న ట్వీట్స్ ఆ పదవికి సరితూగవంటున్నారు.
కానీ ట్రంప్ మాత్రం తానే ప్రెసిడెంట్ ఆఫ్ ట్వీట్స్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎంఎస్ఎన్బీసీ ఛానల్‌కు చెందిన మికా బ్రెజెన్క్సీ, జో స్కారబరోలపై ట్రంప్ తీవ్ర స్థాయిలో వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడాన్ని డెమోక్రటిక్, రిపబ్లికన్ నేతలు మండిపడ్డారు. ఒక్క వైట్‌హౌస్ మాత్రమే ఆయనకు అండగా నిలిచింది. రిపబ్లికన్ సభ్యులు ఎవరూ దేశాధ్యక్షుడిని సమర్థించలేదు.
అయితే తన ట్వీట్లను సమర్థిస్తూ ప్రధాన మీడియాను పక్కన పెట్టి, సోషల్ మీడియాను నమ్ముకోవడం వల్లే తాను ప్రజలకు చేరువవుతున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాదు, బడా మీడియా సంస్థలను ఫేక్ న్యూస్ అని విమర్శించారు. సోషల్ మీడియాను వాడరాదు అని ఫేక్ న్యూస్ సంస్థలు రిపబ్లికన్లపై వత్తిడి తెస్తున్నాయని కూడా ట్రంప్ ఆరోపించారు.
2016లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపుకు సోషల్ మీడియానే కారణమని ట్రంప్ భావిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రసంగాలు వల్లే తనకు విక్టరీ సాధ్యమైందన్నారు.