//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమ్మకానికి స్నాప్‌డీల్‌..?

Category : business

పుష్కలంగా పెట్టుబడులతో ఒకప్పుడు దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థలకు పోటీనిచ్చిన స్నాప్‌డీల్‌ ప్రస్తుతం నిధుల కొరతతో కుదేలవుతోంది. దీంతో స్నాప్‌డీల్‌ మాతృసంస్థ జాస్పర్‌ ఇన్ఫోటెక్‌ దీన్ని విక్రయించే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా పోటీ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా, పేటీఎం ఈ–కామర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. అయితే ఒకప్పుడు 6 బిలియన్‌ డాలర్లకు పైగా (రూ.40వేల కోట్లు) విలువ పలికిన స్నాప్‌డీల్‌కు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 1.5–1.8 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 9,750 కోట్లు– రూ. 11,700 కోట్ల దాకా) మేర మాత్రమే ఆఫర్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. స్నాప్‌డీల్‌లో ఇన్వెస్ట్‌ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌ ఈ చర్చలకు సారథ్యం వహిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం చర్చలింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నందున డీల్‌ ముగిసేదాకా సాఫ్ట్‌బ్యాంక్‌ అదనంగా మరో 50 మిలియన్‌ డాలర్లు సమకూర్చే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫ్లిప్‌కార్ట్‌ కన్నా కూడా పేటీఎం ఈ–కామర్స్‌తోనే చర్చలు కాస్త పురోగతి సాధిస్తున్నట్లు పేర్కొన్నాయి. పేటీఎంలో పెట్టుబడులున్న ఆలీబాబా టీమ్‌ డీల్‌కి సంబంధించి ఇటీవలి కాలంలో పలు సార్లు భారత్‌ను సందర్శించింది. ఒకవేళ నిజంగానే స్నాప్‌డీల్‌ గానీ అమ్ముడైన పక్షంలో దేశీ స్టార్టప్‌ వ్యాపారంలో ఇదే అతి పెద్ద డీల్‌ కానుంది. ఈ–కామర్స్‌ రంగంలో దీర్ఘకాలంలో రెండు లేదా మూడు పెద్ద సంస్థలకు మాత్రమే చోటు ఉంటుందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో ఒకటిగా అమెజాన్‌ ఎలాగూ ఉంటుందని పేర్కొంటున్నాయి.

క్రితంసారి 2016లో నిధులు సమీకరించినప్పుడు స్నాప్‌డీల్‌ వేల్యుయేషన్‌ 6.5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇది గరిష్ట వేల్యుయేషన్‌. అయితే ప్రస్తుతం వస్తున్న ఆఫర్లు చూస్తే.. స్నాప్‌డీల్‌ ఇప్పటిదాకా సమీకరించిన నిధుల కన్నా తక్కువ మొత్తమే కనిపిస్తోంది. మరోవైపు, చర్చలు సాగిస్తున్న పేటీఎం, స్నాప్‌డీల్‌కు సంబంధించి ఇన్వెస్టర్లపరమైన సారూప్యత ఉండటం గమనార్హం. పేటీఎంలో ఇన్వెస్టర్‌ అయిన చైనా దిగ్గజం ఆలీబాబాలో... సాఫ్ట్‌బ్యాంక్‌కి పెట్టుబడులున్నాయి. ఇదే సాఫ్ట్‌బ్యాంక్‌ ఇటు స్నాప్‌డీల్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేసింది. స్నాప్‌డీల్‌ ఇప్పటిదాకా దాదాపు 2 బిలియన్‌ డాలర్లు సమీకరించగా.. సాఫ్ట్‌బ్యాంక్‌ సుమారు 900 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా అత్యధిక వాటాలు (సుమారు 35 శాతం) దక్కించుకుంది.ఈ నేపథ్యంలోనే ఇటు పేటీఎం, అటు స్నాప్‌డీల్‌ మధ్య అనుసంధానకర్తగా సాఫ్ట్‌బ్యాంక్‌ వ్యవహరిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. స్నాప్‌డీల్‌లో కలారి క్యాపిటల్, నెక్సస్‌ క్యాపిటల్, ఆలీబాబా గ్రూప్‌ మొదలైన సంస్థలు కూడా ఇన్వెస్ట్‌ చేశాయి. పేటీఎం ఈ–కామర్స్‌ ఇటీవలే 200 మిలియన్‌ డాలర్లు ఆలీబాబా గ్రూప్‌ నుంచి సమకూర్చుకుంది. అటు ఫ్లిప్‌కార్ట్‌ కూడా మళ్లీ 1 బిలియన్‌ డాలర్లు సమీకరించుకునేందుకు చర్చల్లో ఉంది.