//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచాన్ని చుట్టిరానున్న ఆరుగురు మహిళలు

Category : national

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆరుగురు మహిళలు ఐఎన్‌ఎస్‌వీ-తరిణి నౌకలో ప్రపంచాన్ని చుట్టిరానున్నారు. నావికా సాగర్ పరిక్రమ పేరుతో గోవా నుంచి బయలుదేరే ఈ ఆరుగురు మహిళా నావికా అధికారుల బృందం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలన్నీ సముద్రమార్గంలోనే చుట్టి తిరిగి గోవాకు చేరుకుంటుంది. ప్రపంచాన్ని చుట్టివచ్చే తొలి మహిళా బృందంగా ఈ యాత్రకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

భారత నావికాదళ మహిళా శక్తిని యావత్ ప్రపంచానికి చాటిచెప్పడానికి ఈ యాత్ర ఉపయోగపడనుంది. భారత నౌకాదళంలోకి చేరడానికి యువత ఆసక్తి చూపేలా, నారీ శక్తికి భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని యావత్తు ప్రపంచానికి తెలియజేసేలా ఈ యాత్రకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సెప్టెంబరు 5వ తేదీన గోవా నుంచి ప్రారంభమయ్యే నావికా సాగర పరిక్రమ యాత్ర 164 రోజులపాటు సాగి తిరిగి వచ్చే ఏడాది ఏప్రిల్ 4వ తేదీన మళ్లీ గోవాకు చేరుకుంటుంది.

ఐదు దశల్లో సాగే ఈ యాత్రలో తొలుత ఆస్ట్రేలియా, ఆ తర్వాత న్యూజిలాండ్, ఫాక్‌లాండ్స్ (దక్షిణ అమెరికా), దక్షిణ ఆఫ్రికాల మీదుగా సాగుతుంది. లెఫ్ట్‌నెంట్ కమాండర్ వర్తికా జోషి (రిషికేష్, ఉత్తరాఖండ్) నేతృత్వంలో సాగే ఈ యాత్రలో హైదరాబాద్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ బొడ్డపాటి ఐశ్వర్య, విశాఖపట్నంకు చెందిన లెఫ్ట్‌నెంట్ కమాండర్ స్వాతి కూడా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుకు చెందిన లెఫ్ట్‌నెంట్ కమాండర్ ప్రతిభా జమ్వాల్, మణిపూర్‌కు చెందిన విజయాదేవి, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన పాయల్ గుప్తా ఉన్నారు.

ఈ ఆరుగురు మహిళలు ప్రధాని నరేంద్రమోదీని కలిసి సాగర యాత్ర గురించి వివరించారు. ప్రధానంగా భారత నావికాదళం నారీశక్తి గొప్పదనం గురించి చాటిచెప్పడంతో పాటు పర్యావరణం-వాతావరణ మార్పులు, మేక్ ఇన్ ఇండియా, సముద్రం-అలలు-వాతావరణ వివరాల పరిశీలన, సముద్ర కాలుష్యం, సముద్రయానంపై ఆయా దేశాల్లోని యువతకు ఉన్న ఆసక్తి తదితరాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది.