ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత్‌కు చెందిన పివి సింధూ ఫైనల్స్ లో హోరాహోరీగా పోరాడి, కొద్దిలో స్వర్ణం చేజార్చుకొని రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పోరులో జపాన్ క్రీడాకారిణి ఒకుహర 19-21, 22-20, 20-22 తేడాతో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. దీంతో ఫైనల్ లో ఓడిపోయిన సింధు కు సిల్వర్ మెడల్ ఖాయం అయింది.
స్వర్ణం కోల్పోయినా కోట్లాది మంది భారతీయుల హృదయాలను వశం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో సింధూ ఓడినా, రెండో సెట్‌ను గెలుచుకుంది. దీంతో మూడో సెట్ నిర్ణయాత్మకంగా మారింది. ఈ సెట్లో సింధూ-ఒకుహర హోరాహోరీ తలపడ్డారు. మూడో సెట్ అనుక్షణం అధిక్యం మారుతూ ఉత్కంఠ రేపింది.
వరల్డ్ చాంపియన్ షిప్ లో సింధుకు ఇదో మూడో మెడల్. 2013, 2014 సంవత్సరాల్లో సింధూకు ఈ టోర్నమెంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. మొదటి గేమ్ లో ముందు నుంచి అత్యంత ప్రతిభ కనబరిచిన సింధూ తర్వాత కొంచెం వెనుకంజ వేయడంతో 19-21 తేడాతో మొదటి గేమ్ లో ఓడిపోయింది.
అయినప్పటికీ.. గేమ్ మాత్రం రసవత్తరంగా సాగింది. చివరి వరకు నువ్వా నేనా సై అంటూ గేమ్ సాగిపోయింది. మూడో గేమ్ ఆది నుంచి సమాన పాయింట్లతో చాలా టఫ్ గానే కొనసాగింది. అయితేచివరి వరకు చాలా ఉత్కంఠతో కొనసాగిన ఈ గేమ్ చివర్లో సింధు కొంచెం తడబడటంతో గోల్డ్ మెడల్ ను ఒకుహరా ఎగరేసుకు పోయింది.
కాగా, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ రజతం సాధించడం ఇది రెండో సారి. 2015లో సైనా నెహ్వాల్ రజతం గెలుచుకుంది. సైనా నెహ్వాల్ ఇప్పుడు కాంస్యం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఒకేసారి రెండు పతకాలు సాధించడం భారత్‌కు ఇదే మొదటిసారి. అలాగే 40 ఏళ్ల భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇప్పుడు ఒకేసారి రెండు పతకాలతో భారత్ బృందం స్వదేశానికి తిరిగిరానుంది.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ 2017 లో సిల్వర్ మెడల్ గెలిచిన పీవీ సింధు, కాంస్య పతకం గెలిచిన సైనా నెహ్వల్ కు బ్యాడ్ మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రివార్డులు ప్రకటించింది. సిల్వర్ మెడల్ గెలిచిన సింధు కు రూ. 10 లక్షలు, కాంస్యం గెలిసిన సైనాకు రూ. 5 లక్షలు ప్రకటించినట్లు బీఏఐ తెలిపింది.