వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం గెలవడం పట్ల ఆనందం ప్రకటిస్తూ ఒక వరల్డ్ నెం.1 కావడమే తన ముందున్న లక్ష్యమని భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తెలిపారు. జపాన్ కు చెందిన ఒకుహరాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తాను విజయం కోసం తుదివరకు శ్రమించానని, కాని తృటిలో టైటిల్ చేజారినట్లు ఆమె పేర్కొన్నారు.
టోర్నీ ముగిసిన అనంతరం మంగళవారం ఉదయం కోచ్ గోపీ చంద్, కాంస్యం గెలిచిన సైనా నెహ్వాల్ లతో కలిసి హైదరాబాద్ చేరుకుంది. సింధుకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ "ఫైనల్స్‌లో స్వర్ణం చేజారటంతో కొంచెం నిరాశ చెందాను. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్ మ్యాచ్ బాగా సాగింది. కేంద్ర ప్రభుత్వం క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నది" అని తెలిపారు.
"రజతం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రదర్శన ఎంతో ఆనందాన్ని మిగిల్చిందంది. ఇదంతా కోచ్, తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యమైంది" అని సింధు స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో సింధు 4వ ర్యాంకులో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ "ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్ మ్యాచ్ సుదీర్ఘంగా సాగింది. ఫైనల్స్‌లో సింధు అద్భుతంగా ఆడింది. సింధు ఆడిన ఉత్తమ మ్యచ్‌ల్లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్ ఒకటి. సింధు స్వర్ణం సాధిస్తుందని అందరం ఊహించాం. భవిష్యత్‌లో సింధు తప్పకుండా స్వర్ణం సాధిస్తుంది" అని విశ్వాసం వ్యక్తం చేశారు.
టోర్నిలో శ్రీకాంత్ పతకం సమీపంలోకి వచ్చాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అందరూ బాగా ఆడారు. సైనా, సింధు, కశ్యప్, సాయి, ప్రణవ్‌లు మంచి ఫిట్‌నెస్‌లో ఉన్నారు. 2011 నుంచి స్థిరంగా పతకాలు సాధిస్తునే ఉన్నాం. ఇప్పుడు ఒకే టోర్నమెంట్లో 2 పతకాలు సాధించాం" అని పేర్కొంటూ క్రీడలకు ప్రధాని మోదీ అందిస్తున్న ప్రోత్సహం మరువలేనిదని కొనియాడారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన పీవీ సింధుకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. సింధు భవిష్యత్‌లోనూ అనేక పతకాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. గవర్నర్ తో పాటు సింధుకు పలువురు ప్రముఖులు అభినందనలు చెప్పారు
భారత్ తరఫున ఫైనల్ చేరిన రెండో క్రీడాకారిణిగా రికార్డులకెక్కిన సింధు గతంలో రెండుసార్లు ఇదే చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలను సాధించింది. ఓవరాల్‌గా సైనా కాంస్యంతో కలిపి ఈసారి చాంపియన్‌షిప్‌లో భారత్ ఎప్పుడు లేని విధంగా రెండు పతకాలు గెలిచి మరో రికార్డును సొంతం చేసుకుంది. గతంలో భారత్‌కు రజతంతో పాటు నాలుగు కాంస్యాలు లభించాయి. 1983లో ప్రకాశ్ పదుకొనే భారత్‌కు తొలి కాంస్యాన్ని అందించాడు. 2011లో డబుల్స్‌లో అశ్విని-జ్వాల జోడి మళ్లీ కాంస్యంతో మెరిసింది.