అత్యంత భద్రత మధ్య ఉండే ఇరాన్ పార్లమెంట్‌పై టెహ్రాన్ లో నేడు ముష్కరులు దాడికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ముగ్గురు ముష్కరులు ఆయుధాలతో పార్లమెంట్‌లోకి చొరబడ్డారు. ఈ క్రమంలో వారు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు, ఒక గార్డు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
వెంటనే స్పందించిన భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం పార్లమెంట్లో కాల్పులు కొనసాగుతున్నాయి. ముష్కరులు కొంత మందిని బందీలుగా చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికార సమాచారం లేదు. మొత్తం ముగ్గురు ముష్కరులు పార్లమెంట్ లోకి ప్రవేశించినట్లు ఒక యంపీ చెప్పారు.
మరో వంక అధ్యక్ష భవన్ ను మూసి వేశారు. ఎవ్వరిని బయటకు, లోపలకు వెళ్లనీయడం లేదు. మరో సంఘటనలో ఆయతోల్లా ఖోమేయని మందిరంపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో దక్షిణ టెహ్రాన్ లో పలువురు పౌరులు గాయాలకు గురయ్యారని, ఒక ఆగంతకుడు తనను తానే కాల్చుకొన్నట్లు తెలుస్తున్నది.