//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షాకింగ్ ... పంచాయితీ ఎన్నికల ఖర్చు 10 వేల కోట్ల పైనే

Category : state politics

తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలను ఆశావహులు సవాల్‌గా తీసుకుంటున్నారు. ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక రిజర్వుడు స్థానాల్లోనూ కొన్నిచోట్ల తీవ్ర పోటీ నెలకొంది. పంచాయతీ స్థాయిని బట్టి ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసే పరిస్థితి ఉందని తెలుస్తుంది. దీంతో, మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే వ్యయం రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. రాష్ట్రంలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా.. రెండో విడత ప్రారంభమైంది. ఇప్పటికే కొన్నిచోట్ల వేలం జరగ్గా, మరికొన్నిచోట్ల చర్చలు సాగుతున్నాయి. ఇవి సఫలం కాకపోతే, పోటీలో నిలిచి ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారు.

పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతున్నా.. పరోక్షంగా పార్టీలు తమ వారితో ప్యానల్‌ను ఏర్పాటు చేసి అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నాయి. కొన్నిచోట్ల ఒకే పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సంబంధిత పార్టీకి చెందిన అగ్రనాయకత్వం ఎవరికీ బాహాటంగా మద్దతు ప్రకటించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి చోట్ల ఒకే పార్టీకి చెందిన వేర్వేరు వర్గాలు, గ్రూపులుగా తమ ప్యానల్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో, వీరు ప్రత్యర్థి పార్టీల ప్యానల్‌తోపాటు సొంత పార్టీలోని మరో వర్గం ప్యానల్‌ను ఢీకొట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

తొలుత ఏకగ్రీవంగా సర్పంచ్‌ పదవి కట్టబెట్టేందుకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఏకగ్రీవం కాకపోతే..అంతకు మించి ఖర్చు చేయడానికి కూడా వెనకాడడం లేదు. అతి చిన్న పంచాయతీ అయినా రూ.5 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక, 5వేల జనా భా దాటిన పంచాయతీలైతే రూ.10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు, భారీగా ఆదాయమున్న పంచాయతీల్లో అంతకు మించి ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితికి కనీసం ఐదు నుంచి పది రెట్లకుపైగా ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొందని ఆశావహులు చెబుతున్నారు.

పంచాయతీలో ఉప సర్పంచ్‌ పదవి అత్యంత కీలకం. సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు కూడా చెక్‌ పవర్‌ ఉంటుంది. సర్పంచ్‌ పదవిని ప్రత్యక్ష పద్ధతిలో, ఉప సర్పంచ్‌ పదవిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. దాంతో, సర్పంచ్‌ పదవికి రిజర్వేషన్‌ అనుకూలించాలి. కానీ, ఉప సర్పంచ్‌ పదవికి ఇది లేదు. దాంతో, సర్పంచ్‌ పదవికి రిజర్వేషన్‌ అనుకూలించని వారు ఉప సర్పంచ్‌ రేసులో ఉంటూ వార్డులకు పోటీ చేస్తున్నారు. తమకు మద్దతు ఇచ్చే వారికి అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా, రిజర్వుడు పంచాయతీల్లో జనరల్‌ అభ్యర్థులు ఉప సర్పంచ్‌ పదవికి తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఒకవేళ, సర్పంచ్‌ను సస్పెండ్‌ చేసినా, తొలగించినా అనివార్యంగా ఉప సర్పంచ్‌కే బాధ్యతలు ఇస్తారు. దీంతో, లక్ష నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తానికి మూడు విడతల్లో జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కలిపి 10 వేల కోట్ల నుండి 15 వేల కోట్ల వరకు అభ్యర్థుల ఖర్చు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Related News