Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్‌కు చాలెంజ్‌ విసిరిన సీఎం చంద్రబాబు

Category : state politics

‘ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని కేసీఆర్‌ జగన్‌ చెవిలో చెప్పారా? అదేమైనా రహస్యమా? అదే కేసీఆర్‌తో పోలవరంపై వేసిన కేసులన్నీ వాపస్‌ తీసుకునేలా చేస్తారా?’’ అని విపక్ష నేత జగన్‌కు తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్‌ విసిరారు. జగన్‌ ఒక్క చాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్నారని, అలా ఇచ్చి మన భవిష్యత్తును నాశనం చేసుకుంటామా అని ప్రజలను అడిగారు. ఆదివారం కృష్ణా జిల్లా నందిగామ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, నరసాపురం, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, కాకినాడల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేరస్తులు, కేసులున్న వారికే జగన్‌ టికెట్లు ఇచ్చారన్నారు. ‘‘కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలుంటే 15 చోట్ల వైసీపీ అభ్యర్థులు నేర చరితులే. కొంతమందిపై డజన్ల సంఖ్యలో కేసులున్నాయి. స్వయంగా జగన్‌పై 31 కేసులున్నాయి. ఇలాంటి వాళ్లు రాష్ట్రానికి కావాలా’ అని సీఎం ప్రశ్నించారు. సాయంత్రం కాగానే జగన్‌ లోట్‌సపాండ్‌కు వెళ్లిపోతారని, హైదరాబాద్‌లో ఉండి పాలిస్తామనేవారికి ఓటెందుకు వేయాలని అడిగారు. ఆంధ్ర ప్రజలకు నిబద్ధత, విశ్వాసం లేవని విజయసాయి అంటున్నారని గుర్తు చేశారు. ఇంకా ఏమన్నారంటే..

‘‘అహంకారంతో ఊగిన ఢిల్లీ నేతలను ఇంటికి పంపిన చరిత్ర తెలుగు ప్రజలది! రాష్ట్రంపై విషం చిమ్ముతున్న మోదీని కూడా ఢిల్లీ నుంచి గుజరాత్‌కు పంపించడం ఖాయం. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేందుకే నిధులు ఇవ్వకుండా వేధించారు. ఎన్నికల సమయంలో వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారులను బదిలీ చేస్తున్నారు. ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఇటువంటి మోదీలు వంద మంది వచ్చినా... నేనుండగా ఏపీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రత్యేక హోదాపై మాట మార్చింది మోదీయే. ఒకసారి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మరోసారి ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ఇంకోసారి స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ అన్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయలేదు. జగన్‌లాంటి నేరస్థులను మోదీ ప్రోత్సహిస్తున్నారు.’

‘కేసీఆర్‌, మోదీ ఇస్తున్న డబ్బులు ఖర్చు చేసి అధికారంలోకి రావాలని జగన్‌ భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాఇ. కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామన్నారు. నేను వంద గిఫ్ట్‌లు ఇస్తానన్నా! అందుకే కేసీఆర్‌ ఇక్కడికి రాలేదు. మనకు రావాల్సిన లక్ష కోట్ల ఆస్తులను ఎగ్గొట్టేందుకే కేసీఆర్‌ కోడి కత్తి పార్టీకి రూ.1000 కోట్లు పంపారు. ఎన్నికల్లో జగన్‌ విచ్చలవిడిగా సొమ్ములు పంపిణీ చేస్తున్నారు. ఆ సొమ్మంతా ఎక్కడిదో జగన్‌ సమాధానం చెప్పాలి. మన రాష్ట్రంపై పెత్తనం చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్రులను ఘోరంగా అవమానించిన కేసీఆర్‌తో జత కట్టిన జగన్‌కు బుద్ధి చెప్పాలి. కేసీఆర్‌కు పోలవరం పూర్తి కాకూడదు. రాయలసీమకు నీళ్లు అందొద్దు. అమరావతి నిర్మాణం జరగకూడదు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం నీళ్లు ఇవ్వం అంటారు. అటువంటి వ్యక్తికి జగన్‌ సహకరిస్తున్నారు. కోడికత్తి పార్టీకి ఇదంతా సిగ్గుగా అనిపించడంలేదా! పోలవరం కడితే భద్రాచలం మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే, భద్రాచలం మాకు ఇచ్చేయండి. ఇకప్పుడు భద్రాచలం మాదే. రాముడిని గుండెల్లో పెట్టుకుంటాం.’

‘రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలనేదే నా లక్ష్యం. నా కులం అభివృద్ధి! నా మాతం సంక్షేమం. అందరివాడిగా ఉంటా. అభాగ్యులకు తోడుగా ఉంటా’ చంద్రబాబు ప్రకటించారు. ‘‘నిరుద్యోగ భృతి 3 వేలకు పెంచుతాం. జాబు వచ్చేదాకా యువతకు ఈ బాబు తోడుగా ఉంటాడు. మరోసారి అధికారంలోకి రాగానే వివిధ శాఖల్లోని ఉద్యోగాలు భర్తీ చేస్తాం’’ అని ప్రకటించారు. జగన్‌ మేనిఫెస్టోలో పోలవరం, రాజధాని ప్రస్తావనే లేదని తెలిపారు. వీళ్లకు నీళ్లు అక్కర్లేదేమో అని ఎద్దేవా చేశారు. ‘‘జగన్‌ను కేసీఆర్‌ అన్ని విధాలా కంట్రోల్‌లో పెట్టారు. అందుకనే ఇలాంటి దుస్థితి వచ్చిందని’’ అన్నారు.

Related News