//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్‌కి మరో షాక్ : టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే గండ్ర

Category : state politics

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రకటించారు. సోమవారం(ఏప్రిల్ 22,2019) రాత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆయన తన భార్యతో వెళ్లి కలిశారు. టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. తన నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని గండ్ర తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మాజీ స్పీకర్ మధుసూదనాచారిపై విజయం సాధించారు.గండ్ర పార్టీ మారతారని 2 రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర బాబు గండ్రను కలిసి బుజ్జగించారు. వారి బుజ్జగింపుల తర్వాత తాను కాంగ్రెస్‌ను వీడటం లేదని గండ్ర చెప్పారు. పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఖండించారు. ఇంతలోనే నిర్ణయం మార్చుకోవడం కాంగ్రెస్ నేతలను షాక్ కు గురి చేసింది.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్‌లోకి వస్తే ఆయన భార్యకు జడ్పీ చైర్ పర్సన్ పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని సమాచారం. స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరగనుండగా.. మెజార్టీ జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాలను గెలుచుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటోంది. గండ్రతోపాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య కూడా టీఆర్ఎస్‌లో చేరతారని వార్తలొస్తున్నాయి. గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 102కు పెరగనుంది.

గండ్ర భార్య కూడా భర్త బాటలోనే నడిచారు. కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు గండ్ర జ్యోతి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కి లేఖ రాశారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్‌ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించిన సోనియాగాంధీపాటు కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ గాంధీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరాలని తన భర్త నిర్ణయించుకున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్‌లో కొనసాగడం భావ్యం కాదని జ్యోతి అన్నారు.