బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారూఖ్ ఖాన్ అభిమానులకు క్షమాపణలు వేడుకున్నాడు. బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 102 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.
జట్టు ఓటమి పాలైన అనంతరం షారూఖ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కేకేఆర్ అభిమానులకు క్షమాపణలు వేడుకున్నాడు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిపై దాని ప్రభావం ఎంతమాత్రమూ పడబోదని పేర్కొన్నాడు. అయితే, ఓ జట్టు యజమానిగా ఓటమి తనను బాధించిందని పేర్కొన్నాడు. తమ జట్టులో విజయ కాంక్ష లేనందుకు ఓ బాస్‌గా అభిమానులకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశాడు.
కోల్‌కతాపై విజయంతో రోహిత్ సేన మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో కోల్‌కతాను దాటేసి నాలుగో స్థానంలోకి దూసుకెళ్లింది. కేకేఆర్ ఒకే ప్రత్యర్థి చేతిలో స్థానాలు దిగజారడం మూడు రోజుల్లో ఇది రెండోసారి. నిన్నటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. 21 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.