టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి దిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తో చేరాడు. ఈ ఏడాది ఐపీఎల్లో పాల్గొనే జట్లు స్వదేశీ, విదేశీ ఆటగాళ్లతో సోమవారం నుంచి పూర్తి స్థాయి శిక్షణ శిబిరాలు ప్రారంబించాయి. జట్టులోని సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి సన్నాహక మ్యాచ్‌లు కూడా ఆడుతున్నారు.
మహిళలతో సంబంధాలు ఉన్నాయని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ షమిపై అతని భార్య హసీన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిందే. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కూడా చేపట్టారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపరణలపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధికారులు కూడా దర్యాప్తు చేసారు. అందులో ఎలాంటి నిజంలేదని తేలింది.
దీనితో బీసీసీఐ షమికి కాంట్రాక్టు ఇవ్వడంతో పాటు ఐపీఎల్లో ఆడేందుకు క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. ఇటీవల షమి ప్రాక్టీసులో పాల్గొని వస్తుండగా అతని కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన షమి పూర్తిగా కోలుకుని సోమవారం దిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో చేరాడు. సహచర ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.
ఈ నెల 7న ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్ ముంబై మరియు చెన్నై జట్ల మధ్య ముంబై లో జరుగుతుంది. తరువాత దిల్లీ తన తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్‌ను ఢీకొట్టనుంది. మొహాలి వేదికగా ఏప్రిల్ 8న ఈ మ్యాచ్ జరుగుతుంది.