లింగ మార్పిడిలు జరపడం వైవాహిక బంధాలను ప్రశ్నార్థకరం చేస్తున్నాయి. తాజాగా సింగపూర్ లో భర్త లింగ మార్పిడి చేయించుకున్నందుకు ఓ జంట పెళ్లి రద్దు అయింది. లింగమార్పిడి ఇద్దరు మహిళల మధ్య వివాహం చెల్లుబాటు కాదని, ఇది చట్టాలకు విరుద్ధమని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.
2015లో ఓ జంట పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల అనంతరం భర్త లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత జాతీయ గుర్తింపు కార్డులో ‘ఫిమేల్’గా మార్పులు చేయించుకున్నాడు. అనంతరం వీరి జీవనం సాఫీగానే సాగుతోంది. ఈ జంట ప్రభుత్వం కట్టించిన ఓ అపార్ట్మెంట్ను కొనేందుకు సిద్ధమై దరఖాస్తు చేసుకుంది.
కొత్తగా వివాహం చేసుకున్న వారు గవర్నమెంట్ అపార్ట్మెంట్లను కట్టే వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందుతుంది.అయితే వీరి దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వాధికారులు ఈ వివాహం చెల్లదని, ప్రభుత్వ అపార్ట్మెంట్ కొనడానికి అనర్హులని తేల్చిచెప్పారు. సింగపూర్ రిజిస్ట్రీ ఆఫ్ మ్యారేజెస్ సంస్థ ఆ జంట వివరాలను బహిర్గతం చేసేందుకు నిరాకరించింది.
మగ, ఆడ మధ్య వివాహాన్ని మాత్రమే తాము గుర్తిస్తామని, చట్ట ప్రకారం వీరి బంధం చెల్లుబాటు కాదని పేర్కొంది.స్వలింగ సంపర్కుల వివాహాలను గుర్తించాలని పలు సంఘాలు చేస్తున్న పోరాటాలను ప్రస్తావిస్తూ స్వలింగ వివాహాలను ఇంకా తమ దేశం ఆమోదించలేదని ఆ దేశ ప్రధాని లీ హీన్ లూంగ్ స్పష్టం చేశారు.