అమెరికా మినహా దాదాపు అన్ని జీ-20 దేశాలు పారిస్ ఒప్పందాన్ని సమర్థించడంతో జీ-20 శిఖరాగ్ర సదస్సులో ఆ దేశానికి చుక్కెదురైంది. పర్యావరణ పరిరక్షణ, వాణిజ్య రక్షణవాదంపై అమెరికా విధానాలను వేలెత్తి చూపే రీతిలోసదస్సు తుది ప్రకటన వెలువడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిస్ ఒప్పందం నుంచి ఉపసంహరించుకోవడం సరైన చర్య కాదని ఈ సదస్సు చెప్పకనే చెప్పింది.
అయితే ట్రంప్ ఒత్తిడి మేరకు స్వీయ వాణిజ్య రక్షణకు న్యాయమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం సబబేనని అంటూ ఆ ప్రకటనలో రాయితీ ఇచ్చారు. కాగా సదస్సులో జరిగిన ఉగ్రవాద చర్చను ప్రధాని మోదీ ప్రభావితం చేసినట్టు భారత అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద నిరోధంపై ప్రత్యేక ప్రకటన భారత్ చొరవ ఫలితమేనని పేర్కొన్నాయి.
గ్రీన్హౌస్ వాయువుల తగ్గింపుపై కుదిరిన ఒప్పందం తిరుగులేనిదని, దానిని సత్వరమే, ఎలాంటి మినహాయింపు లేకుండా అమలు చేస్తామని నొక్కిచెప్పాయి. దీంతో అమెరికా ఏకాకి అయిపోయింది. అలాగే వాణిజ్య రక్షణవాదంపై పోరాడుతామని సదస్సు ప్రకటించడం కూడా అమెరికా విధానాలను వేలెత్తి చూపే అంశమే. కాకపోతే న్యాయమైన రక్షణలకు సదస్సు మద్దతు తెలుపడం అమెరికాకు ఊరటనిచ్చే అంశం.
రక్షణవాదంతో సహా అన్నిరకాల అక్రమ వాణిజ్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సంపన్న, వర్ధమాన దేశాలతో కూడిన జీ-20 సదస్సు తీర్మానించింది. ప్రపంచ ఆర్థికవృద్ధిలో పేదదేశాలను ఇతోధికంగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం వృద్ధి అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నప్పటికీ మొత్తంగా చూస్తే వృద్ధి వేగం ఆశించినదానికంటే బలహీనంగానే ఉన్నదని జర్మనీ నగరం హాంబర్గ్‌లో జరిగిన రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు చివరన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఆధారపడదగ్గ, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య సంబంధాలలో పారదర్శకత ప్రాముఖ్యాన్ని సదస్సు ప్రకటన నొక్కిచెప్పింది. సమానావకాశాల కోసం కృషి చేస్తామని సభ్యదేశాలు ఆ ప్రకటనలో తెలిపాయి. రక్షణవాదంతో సహా అన్నిరకాల అక్రమ వాణిజ్య విధానాలపై పోరాడుతూనే ప్రపంచ దేశాల న్యాయమైన స్వీయ వాణిజ్య రక్షణ సాధనాలను గౌరవిస్తామని పేర్కొన్నాయి.
జీ-20 అమెరికాకు పారిస్ ఒప్పందంపై చుక్కెదురు
Category : world
