//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జీఎస్టీ ప్రభావంతో కుదేలైన సేవలు

Category : business

గత నెల ఒకటో తేదీ నుండి అమలులోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంతో సేవల రంగం కుదేలయినట్లు తాజా సర్వేలో వెల్లడయింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన కొత్తలో కొంత అయోమయ పరిస్థితి నెలకొన్నప్పటికీ గత జూన్‌ చివరి నాటికి ఎనిమిది నెలల అత్యధికంగా 52.7 శాతం ప్రగతిని నమోదు చేసిన సేవల రంగం జీఎస్టీ ప్రభావంతో జులై చివరి నాటికి 46 శాతానికి పడిపోయింది.

ఇది 2009 మార్చి తరువాత నమోదయిన అత్యంత కనిష్ట స్థాయి కావటం విశేషం. వస్తు, సేవల రంగాల ప్రగతిని అంచనా వేసే పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పిఎంఐ) జులై చివరి నాటికి 53.1 శాతం నుండి 45.9 శాతానికి పడిపోయింది. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి.

ప్రధాని నరేంద్రమోడీ గత నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత సేవల రంగం జూన్‌ నెలలో అత్యధిక స్థాయి ప్రగతిని నమోదు చేసింది. జీఎస్టీ అమలు అనంతరం జరిపిన తాజా సర్వేలో సేవల రంగం 50 శాతానికి తక్కువకు పడిపోయిందని, ఇంత తక్కువ స్థాయిలో సేవల రంగం ప్రగతి నమోదుకావటం ఆర్నెల్ల వ్యవధిలో ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు.

సేవల రంగ పతనం ఎక్కువగా జీఎస్టీ అమలులో ఏర్పడిన అయోమయం వల్లే జరిగిందని వారు అభిప్రాయపడుతున్నారు. జీఎస్టీ అమలు అనంతరం తమ ఉత్పత్తుల ధరల నిర్ణయంపై ఉత్పత్తిదారుల్లో కొనసాగిన అయోమయ పరిస్థితి వస్తు తయారీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని మరో అనుబంధ సర్వేలో వెల్లడయింది. జీఎస్టీ అమలుతో ఏర్పడిన అయోమయ పరిస్థితితో వస్తు తయారీ రంగం తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని ఈ సర్వే వెల్లడించింది.