దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి చరిత్ర తిరగశాయి. మదుపర్లు భారీగా పెట్టుబడులు పెట్టడంతో చరిత్రలోనే తొలిసారిగా స్టాక్ మార్కెట్లు రికార్డుస్థాయిలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో సోమవారం దేశీయ సూచీలు కొత్త శిఖరాలను చేరుకున్నాయి.
ఆరంభ ట్రేడింగ్ నుంచే భారీ లాభాల్లో పయనించిన సెన్సెక్స్ 355 పాయింట్లు ఎగబాకి 31,715.64 సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయికి చేరింది. అటు ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ నిఫ్టీ కూడా లాభాల్లో ట్రేడ్ అయింది. 105 పాయింట్ల లాభంతో 9,771.05 రికార్డు స్థాయిలో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.52గా కొనసాగుతోంది.
ఉదయం ట్రేడింగ్‌లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) కాసేపు మొరాయించింది. మార్కెట్ మొదలయ్యాక షేర్ల ధరలు అప్డేట్ కాకపోవడాన్ని మదుపర్లు, బ్రోకర్లు గుర్తించారు. సాంకేతిక లోపం తలెత్తడంతో ట్రేడింగ్ నిలిచిపోయినట్లు ఎన్ఎస్ఈ ప్రకటించింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఆగిపోయిన ట్రేడింగ్ 12.30 గంటలకు తిరిగి ప్రారంభమైంది.
ఇక ఎన్ఎస్ఈలో టీసీఎస్, టాటామోటార్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, లుపిన్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభపడగా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటాస్టీల్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, ఐషర్ మోటార్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.