అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సెల్ఫీలే ఇష్టముండవట. ఈ విషయాన్ని ఆయన చికాగోలో బుధవారం జరిగిన ఒబామా ఫౌండేషన్ సమావేశంలో వెల్లడించారు. సమావేశానికి హాజరవుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒబామా అనుచరులు ఆయనతో కలిసి సెల్ఫీలు దిగాలనుకున్నారు. కానీ ఇందుకు ఒబామా ఒప్పుకోలేదు. అందుకు కారణం ఏంటో కూడా ఒబామా చెప్పారు. 'ఇలాంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. నేను అధ్యక్షుడ్ని అయినప్పుడు ప్రజలు నేరుగా నా కండ్లలోకి చూడలేదు. నాకు షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వలేదు. నా వద్దకు వచ్చేముందు సెల్ఫీ స్టిక్‌తో వచ్చారు. ఇప్పటికీ అంతే.
నేను స్కూల్లో చదివేటప్పుడు దిగిన ఫొటోలు నా వద్ద ఉండి ఉంటే నేను అధ్యక్షుడ్ని అయ్యేవాడిని కాదేమో''. ''అలా అని నేను సోషల్‌మీడియా గురించి తప్పుగా మాట్లాడటంలేదు. కానీ ఓ వ్యక్తి మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మనం సోషల్‌మీడియాలో బిజీగా ఉంటూ ఫొటోలు తీసుకుంటూ కూర్చుంటే ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడతాయి'' అని చెప్పుకొచ్చారు ఒబామా. ఒబామా ఫౌండేషన్ సమావేశానికి 60 దేశాలకు చెందిన నేతలు హాజరయ్యారు.