ప్రపంచ బ్యాడ్మింటన్ నంబర్‌వన్ ర్యాంకే తన లక్ష్యం అని, దాని కోసమే కఠినంగా శ్రమిస్తున్నాని, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచిన తరువాత సింధు అన్న మాటలు ఇవి. తన లక్ష్యం దిశగా సింధు అతిపెద్ద అడుగు ముందుకేసింది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచిన సింధు ఏకంగా మూడు స్థానాలు మెరుగుపరుచుకోవడంతో, గురువారం విడుదల చేసిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో ఆమె ఐదు నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది. సింధు కెరీర్లో ఇదే అత్యుత్తమం. సైనా నెహ్వాల్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత షట్లర్ సింధునే. కాకపోతే అగ్రస్థానమే తన లక్ష్యమని చెబుతున్న సింధు ఆ ఘనత అందుకోవాలంటే మరికొంత కాలం వేచిచూడక తప్పకపోవచ్చు. ఎందుకంటే మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోయిన సింధు వచ్చే వారం ప్రకటించే ర్యాంకింగ్స్‌లో కీలక పాయింట్లు కోల్పోనుంది. ఎందుకంటే ఈ ర్యాంకును, అకానె యమగూచి (జపాన్), సంగ్ జి హ్యున్ (కొరియా)లను వెనక్కి నెట్టి చేరుకుంది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు మలేసియా ఓపెన్‌లో క్వార్టర్స్ చేరుకోవడంతో వారి పాయింట్లు మెరుగయ్యే అవకాశముంది. ఇప్పుడు సింధు ఖాతాలో 75759 పాయింట్లున్నాయి. ప్రస్తుతం తై జు యింగ్ (తైపీ; 87911 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోండగా, కరోలినా మారిన్ (స్పెయిన్; 75664) మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. యమగూచి (74349) నాలుగు, సంగ్ జి హ్యున్ (73446)లు ఐదో స్థానాల్లో నిలిచారు.
మరోవైపు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సింధు చేతిలో ఓటమిపాలైన సైనా ఒక ర్యాంకు కోల్పోయి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. నంబర్‌వన్ ర్యాంకుకు చేరుకున్న భారత తొలి మహిళా షట్లర్‌గా 2015లో సైనా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషుల ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లకు టాప్-10లో చోటు దక్కలేదు. అజయ్ జయరాం 20వ స్థానంలో ఉన్నాడు మరియు హెచ్.ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ, కిదాంబి శ్రీకాంత్‌లు వరుసగా 26, 27, 28వ స్థానాల్లో నిలిచారు.