Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హోరాహోరీ పోరులో అంచనాలు తలకిందులు.. వైసీపీ నేతల్లో కలవరం..!

Category : state politics

విజయనగరం జిల్లా ఓటర్లు కృతజ్ఞతను చాటుకున్నారు. జిల్లాకు కంచుకోటగా ఉన్న టీడీపీని మళ్లీ అందలం ఎక్కించాలని నిర్ణయించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ఏకపక్ష తీర్పుతో టీడీపీకి పట్టం కట్టారు. చంద్రన్న సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా తిరిగి సైకిల్‌ వైపే మొగ్గుచూపారు. తిరిగి అనుభవజ్ఞుడైన నాయకుడు సీఎంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం కనబరిచారు. సైకిల్‌ తమకు కడుపునిండా తిండిపెడుతోందని కొందరు. చంద్రన్న తమ ఇంటికి పెద్దకొడుకుగా పింఛన్‌లతో ఆదుకుంటున్నారని ఇంకొందరు...నిరుద్యోగ భృతితో ఆదుకున్న అన్నకు అండగా నిలబడాలని మరికొందరు...సేద్యాన్ని లాభసాటిగా మార్చి అప్పుల నుంచి తమను విముక్తి చేసిన రైతుబాంధవుడు చంద్నన్న రుణం తీర్చుకోవాలని అన్నదాతలు..

ఇలా అన్ని వర్గాల ప్రజలు టీడీపీకి ఎన్నికల్లో మద్దతు పలికారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన పోలింగ్‌లో పట్టుదలగా క్యూలో నిలబడి తీర్పునిచ్చారు. కాగా గురువారం నాటి పోలింగ్‌ సరళిని అధ్యయనం చేసిన టీడీపీ తిరిగి జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ నేతలు తుది లెక్కలు వేసుకున్నారు. ఆరు స్థానాల్లో విజయం ఖాయమని, మరో మూడు స్థానాల్లో హోరాహోరీ పోటీ ఉందని అంచనాకు వచ్చారు. అటు వైసీపీ అంచనాలు తలకిందులైనట్లు ఆ పార్టీ నేతలు కలవరపడుతున్నారు. పసుపు-కుంకుమ తమ విజయావకాశాలను తన్నుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువనేస్తం కూడా టీపీకి కలిసి వస్తోంది.

దాదాపు నెలరోజులపాటు హోరాహోరీగా జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో కీలకమైన పోలింగ్‌ ఎట్టకేలకు ముగిసింది. గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓట్ల పండగకు జిల్లా ఓటర్లు భారీగా తరలివచ్చారు. దీంతో వీరందరికి పూర్తిస్థాయి వసతి కల్పించడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైంది. కనీస సదుపాయాలైన తాగునీరు, విద్యుత్‌ వసతి కల్పనలో విఫలమైనా ఓటర్లు మాత్రం పట్టుదలతో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అసౌకర్యాలతో ఇబ్బందిపడ్డా ఓటు వేయకపోతే తిరిగి సంక్షేమ ప్రభుత్వం బదులు అరాచకం రాజ్యమేలుతుందనే భయంతో పోలింగ్‌ కేంద్రాల్లోనే గంటల తరబడి వేచి ఉన్నారు. ముఖ్యంగా మహిళలైతే ఈదఫా భారీగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.తమకు పసుపు-కుంకుమ,డ్వాక్రారుణాల మాఫీతో అండగా నిలబడ్డ చంద్రబాబుకు కృతజ్ఞతగా ఓటుతో రుణం తీర్చుకున్నారు. 100ఓట్లలో 90ఓట్ల వరకు మహిళలు టీడీపీకి పట్టం కట్టినట్లు ఎన్నికల సరళిని బట్టి తేలిందని ఓ ఇద్దరు టీడీపీ అభ్యర్థులు తమ విశ్లేషణలో తేల్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం తేల్చడంలో వీరి ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. ఎందుకంటే పురుషుల ఓట్లలో చాలావరకు రెండుపార్టీల వైపు చీలగా, మహిళా ఓట్లు మాత్రం ఏకపక్షంగా టీడీపీవైపు పడ్డాయి. దీంతో మే 23న వెలువడనున్న ఫలితాల్లో తిరిగి సైకిల్‌స్వారీ చేయడం ఖాయమని జిల్లా టీడీపీ నేతలంతా అంచనాకు వచ్చారు.

ముఖ్యంగా ఎస్‌.కోట, బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం స్థానాల్లో టీడీపీ విజయం ఖాయమని ధీమాతో ఉన్నారు. ఇక్కడ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు జరిగిన పోలింగ్‌శాతాన్ని పరిశీలించిన అభ్యర్థులు మహిళా ఓటర్లు ఎక్కువగా ఓటు వేయడానికి వచ్చినట్లు గుర్తించారు. వీరంతా తమ పార్టీ వైపు ఉన్నందున పోటీ ఏకపక్షంగా మార్చేశారని, ఇది మరోసారి తాము విజయం సాధించడానికి దోహదపడిందనే అంచనాకు వచ్చారు. దీంతో ప్రత్యర్థికి కొన్ని కులసామాజికవర్గాల ఓట్లు చీలి ప్రయోజనం చేకూర్చినా సంక్షేమ లబ్ధిదారుల అండ తమకు ధీమా ఇచ్చిందనే నమ్మకం వ్యక్తం చేశారు.ఇదికాకుండా చీపురుపల్లి, నెల్లిమర్ల, సాలూరు హోరాహోరీగా ఎన్నికలు జరగ్గా ఇక్కడ కూడా కనీసం రెండుస్థానాలు టీడీపీ ఖాతాలోనే చేరుతాయని విశ్లేషిస్తున్నారు. అయితే మెజార్జీ ఊహించనంతకాకుండా కొంత తగ్గుతుందని లెక్కగట్టారు.

వాస్తవానికి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఆరు సీట్లు టీడీపీకి వచ్చాయి. బొబ్బిలి నుంచి సుజయ్‌ కృష్ణరంగారావు టీడీపీలో చేరారు. దీంతో పార్టీ బలం ఏడుకు పెరిగింది. ఈదఫా ఇదే స్థాయి సంఖ్యలో సీట్లు టీడీపీ దక్కించుకోనుంది. అటు టీడీపీ అభ్యర్థులు కూడా పోలింగ్‌ ముగిసిన తర్వాత ఓటింగ్‌ సరళిపై తమ అనుచరుల ద్వారా ఆరాతీశారు. అందులోభాగంగా మంచి మెజార్జీతో విజయం సాధిస్తామనే అంచనాకు వచ్చారు. మహిళలతోపాటు అన్నక్యాంటీన్లు కూడా తమకు ఓట్లు బాగానే తెచ్చిపెట్టాయని విశ్లేషించారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు సైతం పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి అండగా నిలబడి ఆశీర్వదించినట్లు నిర్దారణకు వచ్చారు.టీడీపీకి అనుకూల పవనాలు ఉన్న నేపథ్యంలో పలుచోట్ల వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగిన తీరుపై గుర్రుగా ఉన్నారు. అధికారం రానప్పుడే ఇలా ఉంటే వస్తే ఇంకెలా ప్రవర్తిస్తారో అన్న భయం తమ అనుచరుల వద్ద వ్యక్తపరిచారు. దాదాపు సగానికిపైగా నియోజకవర్గాల్లో గురువారం రాత్రి 8 దాటినా పోలింగ్‌ కొనసాగుతుండడంతో టీడీపీ అభ్యర్థులు క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ పోలింగ్‌ జరుగుతున్న తీరును పరిశీలించారు. అయితే ఈఓటింగ్‌ తమకు అనుకూలంగా ఉంటుందని, మెజార్టీ పెరగడానికి దోహదపడుతుందనే అంచనాలు వేసుకున్నారు.అటు ఎంపీ స్థానంలో టీడీపీ విజయం ఖాయమేనని గట్టిగా చెపుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వైసీపీలో లెక్కలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఖచ్చితంగా ఐదు స్థానాల్లో విజయం సాధిస్తామని లెక్కలు వేసుకున్నా పోలింగ్‌ తీరును చూశాక అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.

Related News