//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పోలింగ్ తర్వాత ఇక్కడ సీన్‌రివర్స్.. పార్టీలకు కొత్త భయం

Category : state politics

తొలిదశ సార్వత్రిక సమరం ముగిసి వారం రోజులు దాటింది. ఫలితాలకు ఇంకా ఐదు వారాలకు పైగా నిరీక్షించాల్సి ఉంది. ఈలోగా అభ్యర్థి విజయావకాశాలపై కొందరు లెక్కలేసుకుంటుండగా, మరికొందరు బెట్టింగ్‌ల జోరు పెంచారు. 2014 ఎన్నికల్లో ఎన్నికల్లో ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నువ్వానేనా అనే విధంగా తలపడ్డారు. ఆ ఎన్నికల్లో ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానాన్ని వైసీసీ కైవసం చేసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోను టీడీపీ, వైసీపీల మధ్యనే ప్రధాన పోటీ సాగింది. వైసీపీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి పోటీ పడ్డారు. అలాగే బీజేపీ తరుపున కొవ్వూరు బాలచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తరుపున గొర్రె శ్రీనివాసులు, జనసేన తరపున ఇంజా సోమశేఖర్‌రెడ్డిలు పోటీ పడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పలు చోట్ల చీలిక, క్రాస్‌ ఓటింగ్‌ తెరపైకి రావడంతో ఈ ఓట్లు ఏపార్టీ విజయావకాశాలు దెబ్బతీస్తాయో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు. లోలోన మాత్రం తీవ్ర అందోళన చెందుతున్నారు. ఫలితాల కోసం నిరీక్షించే సుధీర్ఘ విరామ క్రమంలో బెట్టింగ్‌రాయుళ్లు తెరపైకి వచ్చి పార్టీలో అంచనాలను మరింత పెంచుతున్నారు.

ఈనెల 11న ఎన్నికలు జరిగాయి. ఇవి తొలి విడత ఎన్నికలు కావడంతో ఫలితాల కోసం మే 23 వరకు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014 ఎన్నికల్లో 2,32,181 ఓటర్లకు గాను 1,80,972 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పట్లో పోలింగ్‌ శాతం 78.66 నమోదు అయింది. కాగా తాజా ఎన్నికల్లో 2,36,730 మంది ఓటర్లకు గాను 1,82,125 మంది ఓటర్లు ఓటు వేయగా, పోలింగ్‌ శాతం 76.93 నమోదు అయింది. ఇందులో పురుషుల ఓటర్లు 1,15,532 మంది ఉండగా, వీరిలో 88,291 మంది ఓటు హక్కును వినియోగంచుకున్నారు. స్త్రీల విషయానికి వస్తే, 1,21,157 మందికి గాను 93,824 మంది ఓట్లు వేశారు. స్త్రీ, పురుషుల ఓట్ల శాతం బేరీజు వేస్తే, స్త్రీలు 1.02 శాతం అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు అదిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగంచుకోవడంతో ఎవరికి వారు తమకు అనుకూల పరిస్థితులున్నాయని, ఆ ధిశగానే తీర్పు వస్తుందన్న ధీమాతో ఉన్నారు.

మెజార్టీల అంశంపై మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. పందెంకోళ్లు కాలు దువ్వినట్లే బెట్టింగ్‌ రాయుళ్లు కూడా పందేలకు తెగించడం ఇక్కడ మాములే. కానీ ఈ జోరు ఇపుడు కాస్త తగ్గింది. సార్వత్రిక ఎన్నికల్లో క్షేత్రస్థాయి స్పందన భిన్నంగా ఉండటంతో తీర్పుపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. గత ఎన్నికల్లో రూ. కోట్లల్లో పందెలు జరిగాయి. ప్రస్తుతం ఆ పందెలు లక్షలకే పరిమితమయ్యాయన్న వాదన ప్రజల్లో విన్పిస్తోంది. అయితే కొందరు వ్యక్తిగతంగా బెట్టింగులకు పాల్పడుతూ కడప లోక్‌సభ, ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానాలపైనే కాకుండా, రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, తదితర అంశాలపైన బెట్టింగ్‌ కాస్తున్నట్లు సమాచారం. అయితే భారీ మొత్తంలో పందెలు మాత్రం గ్రూపులుగా పందెలు పెడుతున్నట్లు తెలుస్తోంది. కాగా మెజార్టీ అంచనాలపై పందెంరాయుళ్లు అయోమయంలో పడ్డట్లు తెలుస్తోంది. దీనికి కారణం పోలింగ్‌ తీరు విశ్లేషణలో క్లిష్ట పరిస్థితులేనంటూ విశ్లేషకులు భావిస్తున్నట్లు సమాచారం.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా గడువు ఉండటంతో సమస్యాత్మక ప్రాంతాలతో పాటు పందెలపై కూడా పోలీసులు నిఘా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. కౌంటింగ్‌కు ఇంకా ఐదు వారాలు ఉండటంతో గతంలో కంటే భారీగానే బెట్టింగ్‌ జరిగే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.