మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కారణమైన బాంబును ఎవరు తయారు చేశారు, అది ఎక్కడ తయారు అయ్యిందని అంటూ ఇవాళ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 1991 మే 21వ తేదీన ఓ మహిళా సూసైడ్ బాంబర్ వల్ల రాజీవ్ హత్యకు గురికావడం తెలిసిందే.
ఈ ఘటన జరిగిన 26 ఏళ్ల తర్వాత సుప్రీం ఆ హత్యకు సంబంధించి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు వేసింది. జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ ప్రశ్నలు అడిగింది. రాజీవ్ హత్యకు కుట్ర ఎలా జరిగింది, బాంబును ఎవరు తయారు చేశారు, ఎక్కడ చేశారన్న అంశాలపై దర్యాప్తుకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. రాజీవ్ హత్యపై మల్టీ డిసిప్లెనరీ మానిటరింగ్ ఏజెన్సీ(ఎండీఎంఏ) దర్యాప్తును పరిశీలిస్తున్నది.
అయితే ఈ కేసులో దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ధర్మాసనం ఈ ప్రశ్న వేసింది. ఎండీఎంఏ తరపున అడ్వకేట్ పీకే డే వాదించారు. బాంబు తయారీకి సంబంధించిన నివేదిక అంశాలను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ధర్మాసనం ఆ అడ్వకేట్‌ను అడిగింది. ఎండీఎంఏ దర్యాప్తు ఏ దశలో ఉందో చెప్పాలంటూ సొలిసిటర్ జనరల్‌ను బెంచ్ ప్రశ్నించింది. బాంబు తయారీ అంశాలపై ఎండీఎంఏ ఇచ్చిన నివేదికలో క్లారిటీ లేదని అడ్వకేట్ గోపాల్ శంకరనారాయన్ పేర్కొనడంతో ఈ అంశం బయటపడింది.
రాజీవ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్ తరపున అడ్వకేట్ గోపాల్ వాదిస్తున్నారు. ఆత్మాహుతి బాంబులో వాడిన రెండు బ్యాటరీలను పెరారీవాలనే సరఫరా చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ కేసులో అతను యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నాడు. తన క్లయింట్ నిర్దోషి అని తేలాలంటే, అసలు బాంబును ఎలా తయారు చేశారో తెలియాలని అడ్వకేట్ శంకరనారాయన్ కోర్టుకు తెలిపారు. సీబీఐతో పాటు ఇతర కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ నిపుణులు ఎండీఎంఏ దర్యాప్తు బృందంలో ఉన్నారు.