హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తల్లి కానుంది. 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో సానియా, షోయబ్ ల జంట వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబరులో సానియా దంపతులకు తొలి సంతానం కలిగే అవకాశముంది. ఈ విషయాన్ని తానే సోమవారం ట్విటర్ ద్వారా 31 ఏళ్ల సానియా స్వయంగా ప్రకటించింది. తన ట్విటర్ ఖాతాలో ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. ‘బేబీ మీర్జా మాలిక్’ వ్యాఖ్యతో పాటు ఓ ఫొటో కూడా పెట్టింది. మూడు తలుపులున్న వార్డ్‌రోబ్‌లో మొదటి దాంట్లో టవల్స్, నీళ్ళ సీసా, మీర్జా పేరున్న జెర్సీ..
చివరి దాంట్లో టవల్స్, నీళ్ల సీసా, మాలిక్ పేరుతో జెర్సీ ఉన్నాయి. మధ్యలో టవల్స్, పాల సీసా, మీర్జా- మాలిక్ పేరుతో బేబీ డ్రెస్ హ్యాంగర్‌కు తగిలించి ఉంది. అదే ఫొటోను ‘మీర్జా మాలిక్’ వ్యాఖ్యతో షోయబ్ మాలిక్ ట్విటర్లో పోస్టు చేశాడు. సానియా తల్లి కాబోతున్న సంగతిని తండ్రి ఇమ్రాన్ మీర్జా ధృవీకరించాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమకు పుట్టబోయే బిడ్డ ఇంటి పేరును ‘మీర్జా మాలిక్’గా పెడతామని సానియా తెలిపింది. కాగా మోకాలి గాయం కారణంగా 2017 అక్టోబరు నుంచి సానియా ఆటకు దూరంగా ఉన్న సంగతి విదితమే.