హైదరాబాద్ షట్లర్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. దాదాపుగా పదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించి.. పెళ్లికి పచ్చ జెండా ఊపారు.
కొంత కాలంగా వీరిద్దరి కుటుంబాల మధ్య పెళ్లికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వివాహం జరిగే తేదీని కూడా ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి. సైనా, కశ్యప్ జంట డిసెంబర్ 16న పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అయితే, వీరి వివాహం నిరాడంబరంగా జరగనుంది. ఇరువురు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. అనంతరం ఐదు రోజుల తరువాత డిసెంబర్ 21న వైభవంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరు కానున్నారని సైనా సన్నిహితులు చెబుతున్నారు.
2005లో పుల్లెల గోపీచంద్ అకాడమిలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. గత కొంత కాలంగా వీరి ప్రేమ గురించి మీడియా ప్రస్తావించినప్పుడు స్పందించలేదు. అదే విధంగా ఖండించనూ లేదు. ఇద్దరూ బ్యాట్మిటన్ క్రీడా కారులు కాబట్టి వీరి ప్రేమ వ్యవహారం ఎక్కువగా వార్తల్లోకెక్కలేదు.
తాజాగా ఈ స్టార్ ఆటగాళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనన విషయం తెలియగానే అభిమానులు సంతోషంతోపాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 32 ఏళ్ల కశ్యప్ 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. 28 ఏళ్ల సైనా నెహ్వాల్ 2010, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు, 2012 ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు.