//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రిచర్డ్స్‌ ఫోన్‌ చేయకుంటే సచిన్‌ 2007లోనే రిటైర్మెంటే

Category : sports

కరీబియన్‌ ప్రపంచకప్‌ (2007) టీమ్‌ఇండియాకు ఓ పీడకల. బంగ్లాదేశ్‌, శ్రీలంకల చేతిలో అనూహ్యంగా ఓడి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన జట్టు తీవ్ర విమర్శలకు గురైంది. ఆటగాళ్లూ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ప్రపంచకప్‌ అందుకోవాలన్న కల మరోసారి భగ్నమైన వేళ.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కరైతే రిటైర్మెంటే ప్రకటిద్దామనుకున్నాడు. కానీ క్రికెట్‌ దిగ్గజం, తన అభిమాన ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌ చేసిన ఒక్క ఫోన్‌ కాల్‌ తన ఆలోచనను మార్చేసిందంటున్నాడు సచిన్‌.

నా కెరీర్‌లోనే అది దుర్దినం అది (మార్చి 23, ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన రోజు) నా కెరీర్‌లోనే చెడ్డ రోజుల్లో ఒకటి. గెలుస్తామనుకుని ఓడిపోతే కలిగే బాధ అంతా ఇంతా కాదు. బార్బడోస్‌ టెస్టు (1997), 1996 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఓటమి కూడా ఇలాంటివే. 2007 ప్రపంచకప్‌ మాకు ఏమాత్రం కలిసిరాలేదు. బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి మాకు తొలి దెబ్బ. ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఓడిపోయాం. బంగ్లా చేతిలో ఓడతామని నేనెప్పుడూ అనుకోలేదు. మేమేమీ అతి విశ్వాసంతో లేము.

రెండు రోజులు గదిలోనే..: ప్రపంచకప్‌ నుంచి దిగ్భ్రాంతికర నిష్క్రమణ తర్వాత రెండు రోజులు వెస్టిండీస్‌లోనే ఉన్నాం. కానీ నేను ఆ రెండు రోజులు గది దాటి వెళ్లలేదు. నేను పూర్తిగా నీరుగారిపోయా. క్రికెట్లో అత్యుత్తమ రోజులను చూపించిన ఆట అత్యంత చెడ్డ రోజులను కూడా చూపిస్తుంటే భీతిల్లా. క్రికెట్‌ నాకిలా చేస్తుందని వూహించలేకపోయా. చాలా వేదన కలిగింది.

రిచర్డ్స్‌ ఫోన్‌తో నేను నైరాశ్యంలో ఉన్న ఆ సమయంలో నా బ్యాటింగ్‌ హీరో సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ నాకు ఫోన్‌ చేశాడు. క్రికెట్లో ఎత్తు పల్లాల గురించి దాదాపు 45 నిమిషాలు మాట్లాడాడు. ‘ఇప్పుడు నువ్వు రిటైర్‌ కాబోవట్లేదు’ అని చెప్పాడు. నేను చాలా నిరాశలో కూరుకుపోయానని, రిటైర్మెంట్‌ గురించి కూడా ఆలోచిస్తున్నానని మా స్నేహితుడి ద్వారా తెలిసి రిచర్డ్స్‌ నాకు ఫోన్‌ చేశాడు. వేదన నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని, ఇప్పుడే ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దని రిచర్డ్స్‌ చెప్పాడు. వివ్‌ స్ఫూర్తిదాయక మాటలతో నేను కుదుటపడ్డా. అతడి మాటలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. మళ్లీ ప్రపంచకప్‌ కలను సాకారం చేసుకునే పనిలో పడ్డా. తీవ్రంగా సాధన చేశా.