మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? 51 సెంచరీలు బాదినప్పుడే ఆయన సత్తా ఏమిటో అందరికీ తెలిసిపోయింది. అయితే సచిన్ క్రికెట్ దేవుడు కావచ్చు కానీ అతనికి ఫొటోగ్రఫీ గురించి ఏమాత్రం తెలియదని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అంటున్నారు. తాజాగా ఆయన ట్విటర్లో 1990ల్లో ప్రశాంత్ వైద్యతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటో తీసింది ఎవరో కాదు మన లిటిల్ మాస్టరే. దీనిపై సంజయ్ కామెంట్ చేస్తూ.. ‘మా బైసెప్స్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఫొటో సరిగ్గా మధ్యలోకి రాలేదు కదూ?.. సచిన్ బ్యాటింగ్‌లో బెటరేకానీ ఫొటోగ్రఫీలో కాదు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సంజయ్‌పై మండిపడ్డారు. నిజమే మరి 90ల్లో ఆయన ఫోకస్ అంతా క్రికెట్‌పైనే ఉంది. అందుకు ఆయన చేసిన రికార్డులే నిదర్శనం అంటూ అభిమానులు మాస్టర్ బ్లాస్టర్‌కి మద్దతుగా నిలిచారు.