ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకేసారి అమెరికాకు చెందిన 755 మంది దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. రెండు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలకు ఈ చర్య అడ్డం పట్టుతున్నది. రెండు దేశాల మధ్య సంబంధాల్లో మార్పు వస్తుందని చాలా కాలంగా ఎదురుచూశామని, అయితే అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదని ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ పేర్కొన్నారు.
అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని సీరియస్‌గా తీసుకున్న అప్పటి ఒబామా ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో 35 మంది రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే రష్యా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూనే వస్తున్నది.
సెప్టెంబర్ 1లోగా వీళ్లంతా రష్యా వదిలి వెళ్లాలని పుతిన్ ఆదేశించారు. ఆధునిక చరిత్రలో ఇంతమంది దౌత్యవేత్తలను ఓ దేశం బహిష్కరించడం ఇదే తొలిసారని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. దేశవ్యాప్తంగా అమెరికా దౌత్య మిషన్లలో పని చేస్తున్న రష్యా ఉద్యోగులు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. మాస్కోలో ఉన్న అమెరికా ఎంబసీతోపాటు ఎకటెరిన్‌బర్గ్, వ్లాదివోస్టోక్, సెయింట్ పీటర్స్బర్గ్లలో ఉన్న కాన్సులేట్స్‌కు ఈ నిర్ణయం వల్ల నష్టం జరగనుంది. పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ బహిష్కరణల ప్రభావం ఎలా ఉంటుంది? దీనిపై ఎలా స్పందించాలన్నదానిపై చర్చిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. మరిన్ని చర్యలు తీసుకునే ఉద్దేశం తనకు లేదంటూనే.. ఇప్పట్లో అమెరికాతో సంబంధాలు మెరుగయ్యేలా లేవని పుతిన్ చెప్పడం గమనార్హం.
ప్రస్తుతం వెయ్యి మందికిపైగా అమెరికా ఎంబసీ, కాన్సులేట్స్‌లో పనిచేస్తున్నారని, అందులో 755 మంది తన పనిని ఆపేయాలని పుతిన్ రష్యన్ టెలివిజన్‌తో చెప్పారు. అమెరికా దౌత్యవేత్తలు వాడుతున్న ఆస్తులు, వేర్‌హౌజ్‌ను కూడా సీజ్ చేస్తున్నట్లు రష్యా స్పష్టంచేసింది. మరిన్ని చర్యల దిశగా కూడా ఆలోచన చేస్తున్నానని, అయితే ప్రస్తుతానికి ఇంతేనని పుతిన్ తెలిపారు.
.