వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో బ్రిటన్ ప్రజలు ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే పాఠశాలల్లోనూ విద్యార్థులకు ఆత్మరక్షణ తరగతులను పెంచుతున్నారు. దేశంలో మూడు నెలల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో ఆత్మరక్షణ తరగతులకు డిమాండ్ పెరిగింది. దక్షిణ లండన్‌లోని అర్బన్ ఫిట్ ఫియర్లెస్ వెబ్‌సైట్‌ను చూసే వీక్షకుల సంఖ్య రెట్టింపు అయ్యిందని చెప్పారు.
ఇటీవల లండన్ బ్రిడ్జి వద్ద ముగ్గురు ఉగ్రవాదులు కత్తులతో స్వైర విహారం చేసి ఎనిమిది మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఆత్మరక్షణ తరగతులు పెంచాలని తల్లిదండ్రులు ఒత్తిడి పెంచుతున్నారు. కొన్ని పాఠశాలల్లో ఆత్మరక్షణ తరగతులు నిర్వహిస్తుండగా, మరికొన్ని స్కూళ్లలో శిక్షకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉగ్రవాదులు బాంబు దాడులు, తుపాకులతో కాల్పులు జరిపినప్పుడు ప్రజలు ఏమీ చేయలేకపోయినా, కత్తులతో దాడిచేసినప్పుడు మాత్రం వారిని ఎదుర్కొవచ్చని భావిస్తున్నారు. మార్చిలో వెస్ట్‌మినిస్టర్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత శిక్షణ తరగతులకు వచ్చేవారి సంఖ్య 70 శాతం పెరిగిందని బ్రిటిష్ అకాడమీ ఆఫ్ క్రావ్మాగ అధిపతి జాన్ ఆల్డ్క్రాఫ్ట్ తెలిపారు. గత శనివారం ఉగ్రదాడి జరిగిన 24 గంటల తర్వాత వీరి సంఖ్య పదిరెట్లకు పెరిగిందని తెలిపారు.