సుమారు దశాబ్దకాలం పాటు స్ప్రింట్ ఈవెంట్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బోల్ట్ తన కెరీర్లో చివరి 100 మీటర్ల ఫైనల్లో మూడో స్థానంకు సరిపెట్టుకో వలసి వచ్చింది. లండన్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసులో బోల్ట్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. అమెరికా స్టార్ స్ప్రింటర్ జస్టిస్ గాట్లిన్ బోల్ట్‌ను వెనక్కి నెట్టి స్వర్ణం గెలుచుకున్నాడు.
ఎనిమిది సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన బోల్ట్‌ను 35 ఏళ్ల వయసులో గాట్లిన్ అధిగమించడం విశేషం. అమెరికాకే చెందిన క్రిస్టియన్ కోలెమన్ కూడా జమైకా చిరుతను అధిగమించడం విశేషం. ఈ రేసును గాట్లిన్ 9.92 సెకన్లలోనూ, కోలెమన్ 9.94 సెకన్లలోనూ పూర్తి చేయగా బోల్ట్ 9.95 సెకన్లలో పూర్తి చేశాడు. తన అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయంగా ఎంతో మంది క్రీడాభిమానులను సంపాదించుకున్న బోల్ట్ చివరి పరుగులోనూ గెలుపొందుతాడని ఆశించిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు.
కాగా, చివరి పరుగులో మూడో స్థానంలో నిలిచినా వెంటనే బోల్ట్ ఏమాత్రం నిరాశ చెందకుండా విజేతగా నిలిచిన గాట్లిన్‌కు అభినందనలు తెలిపాడు. తరువాత అభిమానుల వైపు వెళ్లి వారితో మాట్లాడుతూ, ఫోటోలకు ఫోజులిస్తూ, సెల్ఫీలు దిగాడు. బోల్ట్ చివరి పరుగును చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు.
"ఈ ప్రదేశం చాలా అద్భుతమైంది. నాకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ క్షణం అద్భుతంగా అనిపిస్తున్నది. కానీ నేను నిరాశపర్చాను. వాళ్లకంటే నేను వేగంగా పరుగెత్తలేకపోయా. కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతుంటాయి. మీ అభిమానాన్ని మాత్రం మరువలేను. నా ఆరంభమే నన్ను చంపేసింది. ప్రతిసారి హీట్స్‌లో ఇది రుగుపడుతుంది. కానీ ఈసారి అలా జరుగలేదు. ఓ రకమైన ఒత్తిడితో చాంపియన్‌షిప్‌నకు వచ్చా. గతంలో ఎప్పుడు ఇలా జరుగలేదు. ఫైనల్లో ఇది స్పష్టమైంది" అంటూ వినమ్రంగా చెప్పారు.