పెద్దనోట్ల రద్దు సందర్భంగా ప్రభుత్వం హడావుడిగా ప్రవేశ పెట్టిన రూ.2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఇప్పుడు నిలిపివేసింది. త్వరలో కొత్తగా చలామణిలోకి తీసుకురానున్న రూ.200 నోట్ల ముద్రణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ నోట్లు వచ్చే నెలే విడుదల కావచ్చని భావిస్తున్నారు.
ఐదు నెలల క్రితమే రూ.2000 నోట్ల ముద్రణను రిజర్వ్‌బ్యాంక్ నిలిపివేసినట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నోట్లను ముద్రించబోదని సమాచారం. అయితే ఇదే సమయంలో కొత్తగా చలామణిలోకి తీసుకురానున్న రూ.200 నోటుపై ఎక్కువ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కర్ణాటకలోని మైసూర్ ప్రింటింగ్ ప్రెస్‌లో రూ.200 నోట్ల ముద్రణ చేపట్టారు. నగదు కొరతను తీర్చేందుకు రూ.200 నోటును తీసుకువస్తున్నామని మార్చిలో రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీటికి నకిలీలు సృష్టించకుండా ఉన్నతస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించనునున్నట్లు తెలిపింది.
గత ఏడాది నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంచలన ప్రకటనతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను చలామణిలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.