ఒక మహిళా జర్నలిస్ట్ తో పరిహాసాలాడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఐరిష్ జర్నలిస్ట్‌తో ఆయన మాట్లాడిన తీరుపై ఇప్పుడు సోషల్ మీడియా తీవ్రంగా మండిపడుతున్నది.
ఐర్లాండ్ కొత్త ప్రధాని లియో వరాద్కర్ను అభినందించడానికి ట్రంప్ ఫోన్ చేశారు. ఆ సమయంలో ఆయన ఓవల్ ఆఫీస్‌లో కొందరు జర్నలిస్ట్‌లు కూడా ఉన్నారు. ఫోన్లో మాట్లాడుతూనే మీ ఐర్లాండ్‌కు చెందిన బ్యూటీఫుల్ జర్నలిస్ట్‌లు ఇక్కడున్నారు అని ఆ దేశ ప్రధానితో ట్రంప్ అన్నారు. ఇంతలో అక్కడే ఉన్న పెర్రీ అనే మహిళా విలేకరిని పిలుస్తూ ‘ఇలారా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. నీ నవ్వు చాలా బాగుంది’ అన్నారు. ట్రంప్ లియోతో మాట్లాడుతూ.. ‘నా ముందు మీ ఐరిష్ ప్రెస్ కూడా ఉంది. ఇప్పుడే వారు నా రూమ్ నుంచి బయటికి వెళుతున్నారు.’ అన్నారు.
ట్రంప్ అలా అనడం కెమెరాల్లో రికార్డ్ అయింది. అప్పుడు నవ్వుకుంటూనే అక్కడి నుంచి వెళ్లిపోయిన కైట్రియోనా పెర్రీ అనే ఆ జర్నలిస్ట్ ఆ తర్వాత అదో అసహ్యమైన ఘటన అని ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసింది. వీడియో చూసినవారంతా ఓ పక్క దేశ ప్రధానితో మాట్లాడుతూ మరోపక్కఅమ్మాయితో ఆ పరాచకాలేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ట్విట్టర్లో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.