ఇరాన్ దేశాధ్యక్షుడిగా హసన్ రోహనీ తిరిగి ఎన్నికయ్యారు. ఆ దేశ అధికారిక మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రతిపక్ష నేత ఇబ్రహీం రైసీపై రోహనీ విజయం సాధించినట్లు పేర్కొన్నది. మరో నాలుగేళ్లు అధికారంలో ఉండే అవకాశం లభించడంతో మరింత స్వేచ్ఛ, బయట ప్రపంచానికి చేరుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆయన మరింత ముమ్మరం చేసే అవకాశం ఏర్పడింది.
దేశాధ్యక్ష ఎన్నికల్లో పోలైన 40 మిలియన్ల ఓట్లలో సగం కన్నా ఎక్కువ ఓట్లు రోహనీకి వచ్చినట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ఇరాన్ అణ్వాయుధ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రయత్నిస్తున్న రోహనీ రెండవ సారి ఎన్నిక కావడం విశేషం.
68-ఏళ్ళ రోహనీ దేశంలోని ఉదారవాద, సంస్కరణలు అభిలాషిస్తున్న ప్రజల మద్దతుతో స్వదేశంలో విస్తృతమైన రాజకీయ స్వేచ్ఛ, విదేశాలతో సన్నిహిత సంబంధాల కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు.
శుక్రవారం అర్థరాత్రి వరకు జరిగిన ఎన్నికల్లో సుమారు 70 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తున్నది. ప్రాధమిక సమాచారం ప్రకారం ఆయన 22.8 మిలియన్ ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. ఇప్పటి వరకు 38.9 మిలియన్ ఓట్ల లెక్కింపు జరిగాయి.