గత రెండు నెలల్లో టెస్ట్ క్రికెట్లో ప్రతిభ చాటిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ వన్డే అరంగేట్రానికి మార్గం సిద్ధమైంది. వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు గౌహతిలో జరిగే తొలి మ్యాచ్‌లో రిషబ్ ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌కు బీసీసీఐ వెల్లడించిన 12 మంది ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్ పేరు ఖరారైంది.
స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా రిషబ్ ఆడనున్నాడు. ఇక వికెట్ కీపర్‌గా ఎం.ఎస్.ధోనీ రంగంలోకి దిగనున్నాడు. కాగా, క్రికెట్ మైదానంలో 100 శాతం ఆటను ప్రదర్శించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని అంతకు ముందు ట్విట్టర్లో రిషబ్ పంత్ పేర్కొన్నాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగే తొలి వన్డేలో ఆడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. పంత్ కోరుకున్నట్టుగానే బీసీసీఐ ఈ 21 ఏళ్ల బ్యాట్స్‌మన్ పేరును తుది జట్టులో ఉంచింది.
మరోవైపు మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లకు కూడా జట్టులో స్థానం దక్కింది. అయితే తుది జట్టులో వీరిద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది చూడాలి.
జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అంబటి రాయుడు, రిషబ్ పంత్, ఎం.ఎస్.ధోనీ(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్