వేలకోట్ల రూపాయల సంపదకు వారసుడైన ఒక యువకుడు నెలరోజుల పాటు హైదరాబాద్ లోని అజ్ఞాతంలో గడిపాడు. రూ 500 నోటు మాత్రమే తనతో తీసుకు వచ్చిన అతను హైదరాబాద్ లోని ఒక మురికివాడలో, తానెవ్వరో ఎవ్వరికీ తెలియకుండా అతి సామాన్య జీవితం గడిపాడు.
గుజరాత్‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి అయిన ఘన్‌శ్యాం డోలాకియా కుమారుడే హితార్థ్. ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం వారిది. ఆ కుటుంబ ఆచారం ప్రకారం వ్యాపారంలోకి అడుగుపెట్టాలని భావించే వారు ఎవరైనా తప్పనిసరిగా నెల రోజులపాటు తమకు తెలియని ప్రాంతంలో సామాన్యుడిలా బతకాలి.
ఇప్పుడు హితార్థ్ చేసింది కూడా అదే. న్యూయార్క్‌లో చదువుకున్న అతడు తండ్రి మాట ప్రకారం రూ. 500తో హైదరాబాద్ వచ్చి చిన్నాచితక ఉద్యోగాలు చేసి నెల రోజులు గడిపాడు. రకరకాల ఉద్యోగాలు చేసి కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. తన ఉనికి బయటికి చాటకుండా ఇరుకు గదుల్లో, మురికివాడల్లో జీవనం వెళ్లదీశాడు.
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి, హితార్థ్ ఫ్యామిలీకి స్నేహం ఉంది. అయితే తన కొడుకు హైదరాబాద్ వచ్చిన విషయాన్ని ఘనశ్యామ్ ఆయనకు తెలియనీయలేదు. నెల రోజులపాటు అజ్ఞాతంలో గడిపాకే కుటుంబ సభ్యులు వచ్చి హితార్థ్‌ను కలిశారు.
ఏటా పండుగల సమయంలో తన దగ్గర పనిచేసే వారికి కార్లు, ఖరీదైన ఫ్లాట్లు ఇస్తూ వార్తల్లో నిలిచే వజ్రాల వ్యాపారి ఈ సారి తన కొడుకును ఇలా బయటకు పంపి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో హితార్థ్ సోదరుడు కూడా ఇలాగే నెల రోజులపాటు వేరే ఊళ్లో గడిపాడు.