//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రిజర్వేషాలు

ఎంతో మంది ఈ రిజర్వేషన్లు ఉపయోగించుకొని రాజకీయాల్లోనూ,ప్రభుత్వ ఉద్యోగాల్లోను, IAS, IPS మొదలగు సివిల్ సర్వీసుల్లోనూ,ప్రైవేట్ ఉద్యోగాల్లోను గణనీయమైన ప్రగతి సాధించారు.

భారత రాజ్యాంగం కొన్ని వెనుకబడిన కులాలను ప్రత్యెక పరిస్తితులలో ప్రత్యేక వర్గాలుగా పరిగణించి ప్రభుత్వఉద్యోగాలు, విద్యా వ్యవస్థలో ప్రవేశాలు మొదలగు వాటిలో కొన్ని అవకాశాలను వారికోసమే ప్రత్యేకంగా రిజర్వు చేయటం జరిగింది. ఈ రిజర్వేషన్లు కల్పించటం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఆయా కులాలు సామాజికంగా,ఆర్ధికంగా వెనుకబడి ఉండటమే. మన దేశములో కొన్ని కులాలు సమాజంలో కొన్ని తరాలుగా అవమానాలకు, అన్యాయాలకు,వెనుకబాటుతనానికి గురయ్యాయి. ఆయా కులాలు సమాజములో ఉన్న పోటీని తట్టుకొని అందరితో సమానముగా నిలబడటానికి అవకాశాలు కల్పించటం కోసం రాజ్యాంగ సభ ఈ రిజర్వేషన్లు కల్పించింది.అవగాహన లేకపోవడం, ప్రభుత్వం కూడా సరైన దిశలో ప్రచారం చేయకపోవడం ఇతరత్రా కారణాలతో ముందు తరాలలో చాలామంది వీటిని ఉపయోగించుకోలేదు. కొంతమంది నాయకుల పోరాటాల వల్ల, ప్రభుత్వ ప్రచారం వల్ల నెమ్మది నెమ్మదిగా ఆయా కులాల్లో వారికి రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల అవగాహన కలిగింది. ఎంతో మంది ఈ రిజర్వేషన్లు ఉపయోగించుకొని రాజకీయాల్లోనూ,ప్రభుత్వ ఉద్యోగాల్లోను, IAS, IPS మొదలగు సివిల్ సర్వీసుల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించారు. విద్యా వ్యవస్థలోని రిజర్వేషన్లు ఉపయోగించుకొని ప్రైవేట్ ఉద్యోగాల్లోను రాణిస్తున్నారు, సామాజికంగాను ఆర్దికంగాను ఉన్నత స్థానాల్లో ఉంటున్నారు.

ఒక్కసారి ఈ రిజర్వేషన్ వ్యవస్థ ని ఉపయోగించుకొంటున్న వాళ్ళ సమాచారాన్ని నిశితముగా పరిశీలిస్తే అసలు విషయం బోధ పడుతుంది.

ఇది నాణానికి ఒక వైపు మాత్రమే ఇంకా ఎంతో మంది ఆయా కులాల్లో సరైన అవకాశాలు లేక, రాక, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. దీనికి కారణాలు అన్వేషిస్తే జనాభా పెరుగుదల ఒక కారణం కావచ్చు. ఆయా కులాల్లో పెరుగుతున్న జనాభా శాతం కి తగినట్టుగా రిజర్వేషన్ శాతం పెరుగక పోవటం వల్ల రిజర్వేషన్ వ్యవస్థ మీద వత్తిడి విపరీతముగా పెరిగింది. అందువల్లే అప్పుడప్పుడు ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేయటం మనం చూస్తున్నదే. ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అనేది అంత సులభంగా జరిగే పరిణామం కాదు. జనాభా పెరుగుదల అనేది దాదాపుగా అన్ని కులాల్లో ఉంది. దీనికి మనం ఎవరినో నిందించి ఉపయోగం లేదు. రిజర్వేషన్ వ్యవస్థ లోని లోపాలే దీనికి అసలు కారణంగా చెప్పవచ్చు. ఒక్కసారి ఈ రిజర్వేషన్ వ్యవస్థ ని ఉపయోగించుకొంటున్న వాళ్ళ సమాచారాన్ని నిశితముగా పరిశీలిస్తే అసలు విషయం బోధ పడుతుంది. ఎవరైతే తాతల తరంలోగాని, తండ్రుల తరంలోగాని రిజర్వేషన్లు వినియోగించుకొన్నారో వారి కుటుంబంలోని తరువాతి తరాలు ఈ రిజర్వేషన్లు అందిపుచ్చుకోవడంలో ముందున్నారు.

నవీన్ ప్రభుత్వ ఉద్యోగాన్నే ఎంచుకున్నాడు. అనిల్ తన ఊరు వెళ్లి పొలం పనులు చేసుకుంటూ రైతు కూలిగా మిగిలాడు. ఇదే పరిస్థితి అనిల్ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు ఎదురవుతుంది.

ఉదాహరణకి నవీన్, అనిల్ SC వర్గానికి చెందిన యువకులు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రైవేట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. నవీన్ వాళ్ళ నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి (రిజర్వేషన్ వల్ల వచ్చింది ), అనిల్ వాళ్ళ నాన్న ఒక రైతు కూలి. నవీన్ చదువంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్, కార్పొరేట్ కాలేజీ ల్లో జరిగింది. అనిల్ సాధారణ పాఠశాల, సాధారణ కాలేజీ ల్లో చదువుకున్నాడు. నవీన్ కి ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రైవేట్ ఉద్యోగానికి పెట్టిన ప్రవేశ పరీక్షల్లో అనిల్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి (వస్తాయి కూడా). దీనికి కారణం అతనికి లభించిన ప్రత్యేక శిక్షణ , దానికి అయ్యే ఖర్చుని భరించగలిగే ఆర్థికస్తోమత. నవీన్ రెండు ఉద్యోగాలకి (ప్రభుత్వ , ప్రైవేట్) సెలెక్ట్ అయ్యాడు. అనిల్ కి, నవీన్ తప్పుకొంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కానీ నవీన్ ప్రభుత్వ ఉద్యోగాన్నే ఎంచుకున్నాడు. అనిల్ తన ఊరు వెళ్లి పొలం పనులు చేసుకుంటూ రైతు కూలిగా మిగిలాడు. ఇదే పరిస్థితి అనిల్ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు ఎదురవుతుంది. ఇలాంటి అనిల్ లు మరెందరో!ఇందులో నవీన్ ను తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వ్యక్తుల తప్పు కాదు. ఇది రిజర్వేషన్ వ్యవస్థ లోని లోపం. రిజర్వేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నవాళ్ళతో, ఎన్నడు ఉపయోగించుకొని వాళ్ళను పోటీ పడమంటే వాళ్ళు ఎప్పటికి పోటీపడలేరు. ఎందుకంటే వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా మిగతా వారి కంటే వెనుకబడి ఉండటమే. ఈ వ్యవస్థను ఇలాగె ఎన్నాళ్ళు కొనసాగించిన వెనుకబడిన వర్గాలకు జరిగే ఉపయోగం పెద్దగా ఉండదు.

ప్రభుత్వమే ఒక ప్రక్క సమాజాన్ని కులాల పరంగా విడదీసి అవకాశాలు (రిజర్వేషన్ ) కల్పిస్తూ, మరో ప్రక్క కులనిర్మూలన అంటే అది ఎన్నటికి సాధ్యమయ్యే పని కాదు.

ఇతర వర్గాలలో ఈ రిజర్వేషన్ వ్యవస్థ మీద అసహనం పెరుగుతోంది. ఆయా కులాల్లోని పేదలకు ఎటువంటి అవకాశాలు లభించటం లేదు. వాళ్ళు కూడా మాకు రిజర్వేషన్లు కల్పించమని ఆందోళనలు చేస్తున్నారు. రిజర్వేషన్లను దీర్ఘకాలం కొనసాగించడం కూడా సమాజానికి మంచిది కాదు. ఒక తప్పును సవరించడానికి మరొక తప్పు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దాదాపుగా అన్నికులాల్లోని పేదలకు ఎటువంటి అవకాశాలు లభించటం లేదు, ఆర్ధికంగా స్తోమత ఉన్నవాళ్లే అన్నింటా రాణిస్తున్నారు. ఇవన్నీమళ్ళి సమాజంలో సంఘర్షణను పెంచుతాయి. ప్రభుత్వమే ఒక ప్రక్క సమాజాన్ని కులాల పరంగా విడదీసి అవకాశాలు (రిజర్వేషన్ ) కల్పిస్తూ, మరో ప్రక్క కులనిర్మూలన అంటే అది ఎన్నటికి సాధ్యమయ్యే పని కాదు.ఇప్పటికే ఈ వవస్థ వల్ల ఎందరో మేధావుల సేవలను ఈ దేశం ప్రభుత్వరంగంలో కోల్పోయింది.ఇది సరిపోదు అన్నట్టుగా కొన్ని రాజకీయపక్షాలు ప్రైవేట్ ఉద్యోగాలలో రిజర్వేషన్ అని ఆందోళనలు చేస్తున్నారు. అది జరిగే పని కాకపోవచ్చు కానీ ఒక వేళ ఆలా జరిగితే అది కులఘర్షణలకు, సామాజిక విభజనకు దారితీస్తుంది. ఆందోళనలు చేస్తున్నవారు గమనించవలిసిన విషయం ఒకటి ఉంది.ఇప్పటికే అవకాశాలు తగ్గిపోయి ఇతర కులాల్లోని పేదలు అనేక కష్టాలకు గురి అవుతున్నారు. వారికీ ఉన్న ఏకైక అవకాశం ప్రైవేట్ రంగం, దానిలోనూ వారి అవకాశాలకు కోతపెడదాం అనుకుంటే వారు ప్రతిఘటించవచ్చు. కొన్నివర్గాలకు మేలుచేయటంకోసం ఇతర వర్గాల అవకాశాలను నిరంతరం దూరం చేస్తుంటే ఆయా వర్గాలుతిరుగుబాటు చేస్తాయి. పిల్లి నైనా ఒక గదిలో బంధించి దాడి చేయాలనీ చూస్తే అది పులిలా తిరగబడుతుంది.చరిత్ర నుంచి మనం నేర్చుకున్నది అదే. అప్పుడు పరిస్థితులు మరింత దిగజారుతాయి.

వెనుకబడిన కులాల్లోని ఆర్దికముగా ఉన్నత వర్గాలు, వారి కులం లోని పేద వర్గాల పట్ల అమానవీయంగా ప్రవర్తించటం మనం చూస్తున్నాం.ఈ ఆర్దిక పరమైన విభజన దాదాపుగా అన్ని కులాలలోను వేళ్లూనుకుపోయింది.

కొన్ని కులాలు సామాజిక అసమానతలకు గురి అయ్యాయి ఇంకా కొన్ని చోట్ల అవుతున్నాయి. అవును ఇది అందరూ ఒప్పుకోవలసిన నిజం. అలాగే ఈరోజు ప్రజల ఆలోచన విధానంలో ఇతర కులాల పట్ల గణనీయమైన మార్పువచ్చింది, దానిని కూడా మనం గమనించాలి. ఈ రోజున ఉన్న పరిస్తితుల్ని నిశితముగా గమనిస్తే సమాజం కులాల కన్నా కూడా ఆర్దిక అసమానతల పరంగా ఎక్కువ విడిపోయినట్లు అర్దమవుతుంది. వెనుకబడిన కులాల్లోని ఆర్దికముగా ఉన్నత వర్గాలు, వారి స్వకులం లోని పేద వర్గాల పట్ల అమానవీయంగా ప్రవర్తించటం మనం చూస్తున్నాం.ఈ ఆర్దిక పరమైన విభజన దాదాపుగా అన్ని కులాలలోను వేళ్లూనుకుపోయింది. మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు గడుస్తున్నాఇంకా రిజర్వేషన్లు కొనసాగించవలసిన పరిస్తితి ఉందంటే అందుకు అత్యధిక బాద్యత పాలకులు, రాజకీయనాయకులే తీసుకోవాలి. రిజర్వేషన్లను అమలు చేయటంలో లోపాలను సరిదిద్దకుండా ఎప్పటికప్పుడు ఓటు రాజకీయాలకు పాల్పడటం వల్ల దాని స్ఫూర్తి దెబ్బతింది. ఆయావర్గాల లోని ఎంతో మంది ప్రజలు అభివృద్దికి దూరంగా ఉండిపోయారు. మేధావులు ఎవరైనా దానిని సరిచేద్దాం అనుకుంటే చాలు అవి ఎదో రద్దు చేస్తున్నట్టుగా రాజకీయపక్షాలు, కులసంఘాలు(ఈ సంఘాలలో కూడా ఆర్దికముగా ఉన్నత వర్గాలదే పై చేయి) గందరగోళం చేస్తాయి. ఎల్లకాలం ఈ రిజర్వేషన్లు ఇలాగే కొనసాగిస్తూ సమాజాన్ని కులాల పరంగా విడదీస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకోటానికి మాత్రమే అవి ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగె కొనసాగితే ఎదో ఒకరోజు ఆయా వర్గాలే కడుపు మండి చింతబరిక వైద్యం చేయక తప్పదు.

రిజర్వేషన్ స్ఫూర్తి కూడా చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించడం మాత్రమే.

వందల సంవత్సరాలు ఇలాగే ఈ రిజర్వేషన్లను కొనసాగించడం ప్రజలలో అసంతృప్తిని, అసహనాన్ని కలిగిస్తుంది. దీనికి ముగింపు ఎప్పుడు పలుకుతారో స్పష్టంగా చెప్పవలిసిన బాద్యత మన రాజకీయ, శాశన, న్యాయ వ్యవస్థలపై ఉంది. ఈ వ్యవస్థ ని సమీక్షించి మార్పులు చేయటమే ఉత్తమ మార్గం. అప్పుడే వెనుకబడిన వర్గాల లోని పేదలు కూడా అభివృద్ధి చెందుతారు. ఒక తరంలో కానీ రెండు తరాల్లో కానీ రిజర్వేషన్ ఉపయోగించుకున్న కుటుంబాలకు, ఆర్ధికముగా ఉన్నతవర్గాలకుఈ సదుపాయాన్ని రద్దు చేయాలి (నిపుణులు పరిశీలనతో). వాటిని ఆయా కులాల్లోని ఈ సదుపాయాన్ని ఇంతవరకు పొందని ఇతర పేదలకు అందుబాటులోకి తేవాలి. అప్పుడే కాలక్రమేణా వారిలోని వెనుకబాటుతనం దూరమవుతుంది. అలాగే ఇతర కులాల్లోని పేదలకు కూడా ఆర్థిక పరమైన వెసులుబాటు కల్పించాలి. రిజర్వేషన్ స్ఫూర్తి కూడా చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించడం మాత్రమే. ఆ స్ఫూర్తిని కొనసాగించి ఆయా వర్గాలను అభివృద్ధిలోకి తీసుకు రాలేకపొతే నవీన భారత చరిత్రలో ఇవి ‘రిజర్వేషాలు’ గా మాత్రమే మిగులుతాయి.

-- నరేంద్ర నాథ్ దావినేని