ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది ? అంటే వచ్చే సమాధానం చైనా. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. కానీ, అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా కాదనీ, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్ అని షాక్ ఇచ్చారు యి ఫుక్సియన్ అనే పరిశోధకుడు.
యూనివర్సిటీ ఆఫ్ విస్కోన్సిన్-మాడిసన్ రీసెర్చర్ అయిన యి ఫుక్సియన్.. చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరై ప్రసంగించారు. చైనా అధికారిక జనాభా లెక్కలు తప్పుడువని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమని అభిప్రాయపడ్డారు.
దీనికి సంబంధించి కొన్ని లెక్కలను కూడా చెప్పారు. 1991 నుంచి 2016 వరకూ చైనాలో 377.6 మిలియన్ల జననాలు నమోదు అయ్యాయి. కానీ, రికార్డుల్లో మాత్రం ఇదే కాలంలో 464.8 మిలియన్ల జననాలు జరిగినట్లు ఉంది. దీన్ని బట్టి ప్రస్తుతం చైనా జనాభా 1.38 బిలియన్లు కాదని తేలిపోతుందని చెప్పారు. ఫుక్సియన్ ప్రకటనను చైనాకు పలు మీడియా సంస్ధలు ప్రముఖంగా ప్రచురించాయి.
ఇందుకు గల కారణం చైనాను భారత్ జనాభాలో దాటేస్తే చైనా వృద్ధిరేటు అమాంతం పడిపోయే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమతి అంచనాల ప్రకారం 2022కల్లా భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించాలి. ఈ విషయాన్ని 2013లోనే తన పుస్తకం 'బిగ్ కంట్రీ విత్ యాన్ ఎంప్టీ నెస్ట్' లో ప్రస్తావించినట్లు ఫుక్సియన్ తెలిపారు. 2003 నుంచి ఇలా చైనా అధికారిక రికార్డుల్లో జనాభా లెక్కలు తప్పుగా వస్తున్నాయని తాను గ్రహించినట్లు వెల్లడించారు.