అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన గత ఆరు నెలలుగా అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాల జారీని కఠిన తరం చేస్తూ ఉండడంతో ఆందోళన చెందుతున్న భారత టెకీలకు ప్రస్తుతం కొంత ఊరట లభిస్తున్నది. ఈ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని నివారించేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషం కలిగిస్తున్నది.
భారత టెక్కీలకు ప్రయోజనం చేకూర్చే హెచ్–1బీ వర్క్ వీసా ప్రక్రియను అమెరికా వేగవంతం చేసింది. అత్యున్నత స్థాయి విదేశీ నిపుణులు, విద్య, పరిశోధనా సంస్థల్లో పనిచేసేవారు గతంలో మాదిరిగా త్వరితగతిన వీసా పొందే ప్రీమియం ప్రక్రియను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.
హెచ్–1బీ, ఎల్–1 వీసా కార్యక్రమాలు దుర్వినియోగం అవుతున్నాయని, విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్ నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం విదేశీ, ముఖ్యంగా భారత ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా హెచ్–1బీ వీసాలోని కొన్ని కేటగిరీలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపునిస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాల ఉపశమనం కలిగిస్తున్నది.