ముఖేష్ అంబానీ నేపథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కృష్ణా-గోదావరి బేసిన్లో రానున్న రోజుల్లో బ్రిటీష్ సంస్థతో కలిసి దాదాపు రూ.40,000 కోట్ల మేర పెట్టు బడులు పెట్టనున్నట్టుగా ప్రకటించింది. ఇందుకు గాను ఆ సంస్థ బ్రిటీష్ చమురు దిగ్గజం బిపి పిఎల్సితో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించింది. రెండు సంస్థలు కలిసి కెజి బేసిన్లో మరో మూడు సహజ వాయువు ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్టుగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, బిపి గ్రూపు అధినేత బాబ్ డూబ్లేలు తెలిపారు.
కెజి-బేసిన్‌లోని శాటిలైట్ క్షేత్రాలు, కే-సిరీస్ క్షేత్రాలను అభివృద్ధి చేయడం ద్వారా 2020-22 నాటికి రోజుకు 30-35 మిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువును ఉత్పత్తి చేయాలని తాము నిర్ణయించినట్టుగా అంబానీ ప్రకటించారు. సముద్ర తీరానికి దాదాపు 70 కి.మీ. లోపల దాదాపు 2000 మీటర్ల లోతు నుంచి డ్రైగ్యాస్ను వెలికితీయడమే కె-సీరిస్ ప్రాజెక్టు.
భారత్‌లో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు తాజా ప్రాజెక్టులు దన్నుగా నిలుస్తాయని తెలిపారు. భారత్‌లో ఇంధన, మొబిలిటీ రంగాలు వేగంగా వృద్ధి చెందుతున్నా యని, డిమాండ్‌ను అందిపుచ్చుకొని ఎదిగేందుకే రిలయన్స్‌తో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్న ట్టుగా బిపి గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ తెలిపారు.
దేశీయ ఇంధన, సంప్రదాయక రవాణా వ్యవస్థతో పాటు విమాన ఇంధనాల రిటైలింగ్, సాంప్రదాయేతర రవాణా వ్యవస్థ ఎలక్ట్రిఫికేషన్ కూడా ఈ రెండు సంస్థలు విస్తరించనున్నాయి. దేశీయంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే విధంగా వివిధ వ్యాపార కార్యకలాపాలను చేపట్టనున్నట్టుగా వారు తెలిపారు. రానున్న కాలంలో ఇరు సంస్థలు విస్తృతంగా పెట్రోలు బంకులను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.