రిలయన్స్ జియో ఒకసారి రీచార్జ్ చేసుకుంటే కాలపరిమితి అయిపోయేంత వరకు అపరమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. చాలా మంది ఈ సదుపాయాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అయితే దీనికి కంపెనీ చెక్ పెట్టింది. ఇకపై అపరిమిత కాల్స్ అనే మాట రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో ఉండదు. జియో నెట్‌వర్క్‌పై గాని, జియో నుంచి వేరే నెట్‌వర్క్‌కు గాని ఫోన్ కాల్ వెళ్లినప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ ఐదు గంటల(300 నిమిషాల)కు మించకుండా పరిమితి విధించారు. అంటే జియో నంబర్ వాడుతున్నవారు ఒకసారి ఎవరికైనా ఫోన్ చేస్తే ఐదు గంటలకు మించి మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఆ తరవాత ఎవరికీ ఫోన్ చేసుకోలేరు.
అలా కాకుండా ఒక్కో గంట చొప్పున పది మందితో మాట్లాడినా ఏంకాదు. దీనికి అపరిమిత వాయిస్ కాల్స్ నిబంధన వర్తిస్తుంది. అలా కాకుండా సింగిల్ కాల్‌ను ఐదు గంటలపాటు మాట్లాడకూడదు. ఈ మేరకు రిలయన్స్ జియోకు చెందిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లో ఓ మీడియా సంస్థకు ఈ విషయాలు వెల్లడించారు. త్వరలోనే రిలయన్స్ అధికారికంగా ఈ నిబంధనలను వెల్లడించే అవకాశం ఉంది. అయితే సాధారణ వినియోగదారులకు ఈ నిబంధన ఎలాంటి అడ్డంకిని కలిగించదని జియో ఎగ్జిక్యూటివ్స్ అంటున్నారు. గంటల గంటలు మాట్లాడే కొద్ది మందికి మాత్రమే ఇది ఇబ్బంది కలిగిస్తుందని చెప్పారు. మొత్తానికి మొదట్లో అపరిమిత కాల్స్ అని ప్రవేశపెట్టిన జియో ఇప్పుడు దానిపై కొన్ని పరిమితులు పెట్టింది. ఇక ముందు ముందు ఎలాంటి పరిమితులు పెడుతుందో చూడాలి.