పెద్ద నోట్ల రద్దు దెబ్బ ఈ సారి ప్రత్యక్షంగా రిజర్వు బ్యాంకునే కుదిపి వేసింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) చెల్లించే డివిడెండ్ సగానికి పైగా తగ్గింది. 2016- 17 ఆర్థిక సంవత్సరానికి ఆర్బిఐ రూ.30,659 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరంలో ఈ డివిడెండ్ చెల్లింపులు రూ.65,876 కోట్లుగా నమోదయ్యాయి.
అయితే డివిడెండ్ తగ్గడానికి ప్రత్యక్ష కారణాలను రిజర్వు బ్యాంకు వెల్లడించలేదు. దీనికి ప్రధాన కారణం మోదీ ప్రభుత్వం గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేయడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు నోట్ల రద్దుతో కొత్త నోట్లను ముద్రించేందుకు అయిన ఖర్చులు, భారం కూడా ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు.
క్రితం ఆర్ధిక సంవత్సరానికి గాను ఆర్బిఐ అదనపు నిల్వలు రూ.30,659 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు రిజర్వు బ్యాంకు సెంట్రల్ బోర్డ్ ఆమోదం తెలిపింది. ఆర్బిఐ డివిడెండ్‌లో తగ్గుదలకు నోట్ల రద్దునే కారణంగా చెప్పొచ్చని సిటీగ్రూప్ సంస్థ ఆర్థికవేత్తలు సమరిన్ చక్రవర్తి, అనురాగ్ ఝా తెలిపారు. పెద్ద మొత్తంలో నోట్ల రద్దు వల్ల కొత్త నోట్లు ముద్రించడానికి ఆర్బిఐకి భారీగా ఖర్చు అయిందని పేర్కొన్నారు.
ఆర్బిఐ మిగులును నోట్ల రద్దు ప్రభావితం చేసిందని ఫిలిప్ క్యాపిటల్ ఇండియా లిమిటెడ్ చీఫ్ ఎకనమిస్ట్ అంజలి వర్మ అన్నారు. ప్రతి ఏటా జూన్‌లో అకౌంట్లు క్లోజ్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఆర్బిఐ డివిడెండ్‌ను పంపిస్తుంది. అయితే ఇందులో భారీ కోత విధించడం ఆందోళన కలిగించే విషయమేనని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో(2017-18) ఆర్బిఐ నుంచి రూ.58 వేల కోట్ల డివిడెండ్ రావచ్చని కేంద్రం అంచనా వేసింది. ఆర్బిఐతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సేవల సంస్థలన్నింటి నుంచి డివిడెండ్ల రూపంలో మొత్తం రూ.74,901.25 కోట్లు సమకూరవచ్చని బడ్జెట్లో అంచనా వేసింది. ఆర్బిఐ డివిడెండ్ భారీగా తగ్గడంతో ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.