సంచలన దర్శకుడు, శ్రీదేవికి వీరాభిమాని అయిన రామ్‌గోపాల్ వర్మ గత నాలుగు రోజులుగా తన ఆరాధ్య దేవత గురించి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. శ్రీదేవి గురించి, ఆమె గొప్పతనం గురించి, ఆమెతో తన అనుబంధం గురించి ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు. తాజాగా శ్రీదేవి మరణం గురించి వర్మ ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. శ్రీదేవి మరణం వెనకున్న నిజమైన కారణం ఏమిటని ప్రశ్నించారు. శ్రీదేవి మరణం విషయంలో మీడియా ఉదాసీనంగా ఉండడాన్ని తప్పుబట్టారు.
‘‘శ్రీదేవి మరణం గురించి దుబాయ్ పోలీసులు చెప్పిన విషయాన్ని భారత మీడియా అంత సులభంగా ఎలా నమ్మేసింది. భారత్‌లో గతంలో జరిగిన అరుషి, ఇంద్రాణి వంటి కేసుల గురించి ఇక్కడి జర్నలిస్టులు చాలా హడావిడి చేశారు. సొంతంగా ఇన్విస్టిగేషన్ చేశారు. అలాంటిది శ్రీదేవి మరణం గురించి దుబాయ్ పోలీసులు చేసిన నాలుగు లైన్ల ట్వీట్‌ను ఎలా నమ్మేశారు. కేస్ క్లోజ్ అయిపోయిందంటే ఎందుకు ఊరుకున్నారు. అసలు శ్రీదేవి మరణం గురించి వివరణ ఇవ్వాలని కూడా దుబాయ్ పోలీసులు అనుకోలేదు. శ్రీదేవి బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారని చెప్పి కేసును క్లోజ్ చేసేశారు.
ఫోరెన్సిక్, ఎంబామింగ్ సర్టిఫికెట్లలో చాలా అక్షర దోషాలున్నాయి. శ్రీదేవి మరణానికి దారి తీసిన పరిస్థితులను, ఇన్విస్టిగేషన్ తీరును బయటి ప్రపంచానికి వెల్లడిచేయాలని దుబాయ్ పోలీసులపై భారత ప్రభుత్వం, మీడియా ఒత్తిడి తీసుకురావాలి. ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని వారు నమ్మడానికి గల కారణాలేంటో తెలపాలని దుబాయ్ పోలీసులను డిమాండ్ చేయాలి’’ అని వర్మ పేర్కొన్నారు.