ప్రతిపాదిత రైజ్ బిల్లు అమెరికా ఉభయసభల్లో గట్టెక్కితే గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు వరంగా మారగలదని భావిస్తున్నారు. డాలర్స్ డ్రీమ్స్‌తో ఇప్పటికే అమెరికా గడ్డపై ఉన్న తెలుగు టెకీలకు ఉపశమనం కలిగించే అవకాసహం ఉంది. ప్రస్తుతం గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 12 ఏళ్లకుపైగా వేచి ఉండాల్సి వస్తోంది. కొత్త విధానంతో భారతీయులకు వీలైనంత త్వరగా గ్రీన్‌కార్డులు జారీ అవకాశం ఏర్పడగలదని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు అనుసరిస్తున్న సీనియారిటీని కాకుండా ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డు మంజూరు చేసే విధంగా ఈ బిల్లును సెనెటర్లు టామ్ కాటన్, డేవిడ్ పెర్డ్యూ రూపొందించారు. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు పలికారు. ఈ బిల్లు ప్రతినిధుల సభ, సెనేట్ల ఆమోదం పొందితే ట్రంప్ సంతకంతో చట్టంగా మారుతుంది. అప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రాగలదు.
సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు చేసేందుకు విద్యార్థి కోటాతో కలిపి ప్రతి ఏటా అమెరికా 85 వేల హెచ్1బీ వీసాలను మంజూరు చేస్తుంది. అందులో 72 శాతం భారతీయులే దక్కించుకుంటున్నారు. గత ఏప్రిల్‌లో భారతీయుల నుంచి 2018కి 1.99 లక్షల దరఖాస్తులు అందాయి.
గత 11 సంవత్సరాల్లో 26 లక్షలు హెచ్1బీ వీసాలకు దరఖాస్తులు రాగా అందులో 21 లక్షలు భారతీయులవే ఉన్నాయని ఇటీవల అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అందులో 20 లక్షలు కంప్యూటర్ సంబంధిత నిపుణులే ఉన్నారు. తగిన విద్యార్హత, ఆంగ్ల, ఉద్యోగ నైపుణ్యం ఉండటమే ప్రధాన కారణం. దశాబ్దానికిపైగా అమెరికాలో ఉంటున్న వారికి కూడా గ్రీన్‌కార్డు దక్కడం లేదు. అందుకు కారణం సీనియారిటీ, లాటరీ ఆధారంగా ఇస్తుండటమే.
ప్రతిభను నిర్ణయించడం కోసం చదువు, వయసు, ఆంగ్ల ప్రావీణ్యం, జీతం ఆధారంగా పాయింట్లను కేటాయిస్తారు. గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 30 పాయింట్లను అర్హతగా నిర్ణయించారు. పాయింట్లు అధికంగా ఉన్నవారికే గ్రీన్‌కార్డులు కేటాయిస్తారు. తక్కువ నైపుణ్యాలు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారికి గ్రీన్‌కార్డులు లభిస్ అమెరికన్ల ఉద్యోగావకాశాలను కొల్లగొత్తిన్నట్లు కాగలదని, అటువండి ధోరణులు నివారించడం కోసం ఈ బిల్ ను తీసుకు వచ్చారు.
అత్యంత ప్రతిభా వంతులు మాత్రమే అమెరికాకు వలస వస్తే మేధోపరంగా, ఆర్థికంగా అమెరికాకు లాభిస్తుందని భావిస్తున్నారు. ప్రతి ఏటా 10 లక్షల గ్రీన్‌కార్డుల్ని అమెరికా మంజూరు చేస్తోంది. ఈ సంఖ్యను 2027 కల్లా 5 లక్షలకు కుదించాలని కూడా ప్రతిపాదించారు. డిపెండెంట్ గ్రీన్‌కార్డుల వల్ల వలసలు పెరుగుతున్నాయని అమెరికా భావిస్తోంది. అందుకే తల్లిదండ్రులు, తోబుట్టువులు, మేజర్ పిల్లలూ డిపెండెంట్ గ్రీన్‌కార్డులకు అనర్హులుగా చేర్చారు. ఆరోగ్య సమస్యలుంటే తల్లిదండ్రులకు తాత్కాలిక వీసాలు మంజూరు చేస్తారు.
అమెరికాకు హెచ్–1బీ వీసా లేదా మరో ఉద్యోగ వీసాపై వెళ్లినవారు ఆ దేశంలో స్థిరపడాలనుకుంటే మొదట శాశ్వత నివాసితుడి హోదా (గ్రీన్‌కార్డు) పొందాలి. గ్రీన్‌కార్డు వస్ ఇక వీసాతో పని ఉండదు. వీసా రెన్యువల్‌తో పనిలేకుండా శాశ్వత నివాసితుడి హోదాలో ఉద్యోగం చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు వచ్చిన ఐదేళ్లకు అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు లేదా పౌరసత్వం ఉన్నవాళ్లు తమ కుటుంబసభ్యులకు గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏటా 4. 80 లక్షల మందికి డిపెండెంట్ విభాగంలో గ్రీన్‌కార్డులు ఇస్తారు.అలాగే శాశ్వత ఉద్యోగుల కోటాలో ఏటా 1. 40 లక్షల గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తారు. వీటికి పనిచేస్తున్న సంస్థ ధ్రువీకరణతో దరఖాస్తు చేయాలి. డిపెండెంట్ గ్రీన్‌కార్డుల్లో ఏ ఒక్క దేశానికైనా మొత్తం కార్డుల సంఖ్యలో ఏడు శాతానికి మించి ఇవ్వడానికి లేదు. అలాగే ఉద్యోగుల కోటా గ్రీన్‌కార్డుల్లో ఏ ఒక్క దేశానికైనా మొత్తం కార్డుల్లో రెండు శాతానికి మించి ఇవ్వకూడదనే నిబంధన ఉంది.