//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మానవమాత్రులు తినలేని రైల్వేలో ఆహారం !

Category : national

రైళ్ళలో, రైల్వే స్టేషన్ లలో అమ్ముతున్న ఆహారం మానవ మాత్రులు తినకూడనిది. ఈ వాఖ్య చేసినది ప్రతిపక్షాల వారు కాదు. రైల్వే లలో సరఫరా చేసే ఆహార పదార్ధాలపై పరిశీలన జరిపిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రమాణాలకు  లేదని విరుచుకుపడింది.

రైల్వేల్లో క్యాటరింగ్‌ సర్వీసు ద్వారా అందిస్తున్న ఆహరం, నీరు అసలు వినియోగానికి పనికిరావని తేల్చిచెప్పింది.రైల్వే స్టేషన్లలోని కేటరింగ్ యూనిట్లు, రైళ్ళలో పరిశుభ్రతను పాటించడం లేదని దుయ్యబట్టింది. ప్రయాణికులకు అందజేస్తున్న ఆహారం మానవ వినియోగానికి తగినది కాదని స్పష్టం చేసింది.

పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ప్రకారం 74 రైల్వే స్టేషన్లు, 80 రైళ్ళలో కాగ్ ఆడిట్ జరిగింది. కేటరింగ్ యూనిట్లు, రైళ్ళలో పరిశుభ్రతను పాటించడం లేదని వెల్లడైంది. మానవ వినియోగానికి తగని పదార్థాలను, కలుషిత ఆహారాన్ని, రీసైకిల్ చేసిన ఆహార పదార్థాలను, గడువు మీరిన ప్యాకేజ్డ్ ఫుడ్‌ను, బాటిల్డ్ ఐటమ్స్‌ను ప్రయాణికులకు విక్రయిస్తున్నారని కాగ్ పేర్కొంది. తాగునీటిని కూడా అనధికార బ్రాండ్ల బాటిల్స్‌లో పెట్టి అమ్ముతున్నారని తెలిపింది.

పానీయాల తయారీలో స్వచ్ఛత లేని నీటిని వాడుతున్నారని కాగ్ పేర్కొంది. వ్యర్థాలను ఉంచే డబ్బాలకు మూతలు ఉండటం లేదని, వాటిని సక్రమంగా కడగటం లేదని తెలిపింది. ఆహార పదార్థాలను ఈగలు, దోమలు, దుమ్ము, ధూళి, ఎలుకలు, బొద్దింకల నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవడం లేదని వివరించింది. ఆహార పదార్థాల ధరలను తెలిపే పట్టికలు వెయిటర్లు, కేటరింగ్ మేనేజర్ల వద్ద లేవని పేర్కొంది.

వీటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపింది. క్యాటరింగ్‌ విధానాల్లో తరచుగా మార్పులు చేయడం దీనంతటికీ కారణమని కాగ్‌ పేర్కొంది. 2005 నుంచి భారతీయ రైల్వే తన క్యాటరింగ్‌ పాలసీని మూడు సార్లు మార్చింది. చివరిసారిగా 2017 ఫిబ్రవరిలో మార్పు చోటుచేసుకుంది.