//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేపటి నుంచి రైల్వే నూతన సమయపట్టిక

Category : national

గుంటూరు రైల్వే డివిజన్‌ మీదగా రాకపోకలు సాగించే పలు రైళ్ల వేగాన్ని రైల్వే శాఖ పెంచింది. ఐదు నిమిషాల నుంచి గరిష్టంగా 45 నిమిషాల వరకు వేగం పెంచుతోన్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆయా రైళ్ల వేగం పెంపుదలను ప్రయోగాత్మకంగా పరిశీలించిన రైల్వే శాఖ నవంబర్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్న నూతన సమయపట్టికలో వాటిని చేర్చింది. ఈ మేరకు సోమవారం దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ ఆఫీసు నుంచి గుంటూరు డివిజన్‌ ఆఫీసుకు సమాచారం అందింది.నిత్యం సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరి రాత్రి 9.20 గంటలకు గుంటూరు వచ్చే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ఇకపై రాత్రి 9.15 గంటలకే చేరుకొంటుంది.

వికారాబాద్‌ నుంచి గుంటూరు వచ్చే పల్నాడు సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌ ఇక నుంచి నిత్యం సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3.10కి, నల్గొండలో 4.51కి, మిర్యాలగూడలో 5.21కి, నడికుడిలో 6.01కి, పిడుగురాళ్లలో 6.25కు, సత్తెనపల్లిలో 6.56కు బయలుదేరుతుంది. అలానే కొచ్చువేలి నుంచి హైదరాబాద్‌ వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌ ఇక నుంచి నిత్యం 7.20కి గుంటూరు, 8 గంటలకు సత్తెనపల్లి, 8.28కి పిడుగురాళ్ల, 8.51కి నడికుడి, 9.30కి మిర్యాలగూడ, 10.01కి నల్గొండ, 12.15కు సికింద్రాబాద్‌, 12.55కు హైదరాబాద్‌ చేరుకొంటుంది.

హౌరా - సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ వేకువజామున 4.10 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు పిడుగురాళ్లకు 5.15కు, సికింద్రాబాద్‌కు 9.05కు చేరుకొంటుంది. సికింద్రాబాద్‌ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ పిడుగురాళ్లకు ఇకపై ఐదు నిమిషాలు ముందుగా రాత్రి 7.07 గంటలకు చేరుకొంటుంది. నిత్యం గుంటూరు నుంచి కాచీగూడ బయలుదేరి వెళ్లే ప్యాసింజర్‌ రైళ్ల వేగాన్ని 10 నిమిషాలకు పెంచారు. రేపల్లె - సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌ రైలు వేగం కూడా పది నిమిషాలు పెరిగింది. గుంటూరు - డోన్‌, గుంటూరు - తిరుపతి ప్యాసింజర్‌ రైళ్ల వేగం ఐదు నిమిషాలకు పెంచారు. నరసపూర్‌ - గుంటూరు ప్యాసింజర్‌ రైలు వేగం కూడా ఐదు నిమిషాలు పెరిగింది.

మార్పు చేసిన సమయపట్టిక, పెంచిన రైళ్ల వేగం నవంబర్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. నూతన సమయపట్టికలో కొత్త రైళ్లు ఏమైనా గుంటూరు డివిజన్‌కు మంజూరు అవుతాయేమోనని అంతా ఆశించినప్పటికీ రైల్వే శాఖ ఎలాంటి తీపి కబురు పంపలేదు. ఈ నేపథ్యంలో ఎంపీలు రైల్వే బోర్డు, మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి కనీసం ఒకటి, రెండు రైళ్లు అయినా గుంటూరు మీదగా మంజూరు చేసేలా చూడాలని రైల్వే వినియోగదారుల సంఘాలు కోరుతోన్నాయి.