లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలతో భారతీయ బ్యాంక్ లు అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటున్నాయి. విజయ్ మాల్యా వంటి ఘరానా ఎగవేత దారులు వ్యవస్థను సవాల్ చేసే రీతిలో వ్యవహరిస్తున్నా ప్రభుత్వం నిస్సహాయంగా ఉండవలసి వస్తున్నది. ఈ విషయంలో చైనా లో అటువంటి వారిపై తీసుకొంటున్న చర్యలు ఆచరణయోగ్యం కాగలవా ?
చైనా సుప్రీమ్ పీపుల్స్ కోర్టు 67.3 లక్షల మంది బ్యాంకు రుణాల ఎగవేతదారుల్ని బ్లాక్ లిస్ట్ చేయమని ఆదేశించింది. అటువంటి వారు విమానాల్లో ప్రయాణాలు చేయలేని విధంగా, కొత్తగా రూపాయి రుణం పుట్టకుండా, చివరకు క్రెడిట్ కార్డులు కూడా పనిచేయకుండా ఆంక్షలు విధించనున్నారు.
గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం చైనా ప్రభుత్వం ఇప్పటికే 61.5 లక్షల మందిని విమానాల టికెట్లు కూడా కొనకుండా బ్లాక్ లిస్టు చేసింది. 22.2 లక్షల మంది అసలు హైస్పీడ్ ట్రెయిన్లలో ప్రయాణం కూడా చేయకుండా నిషేధించింది. పాస్‌పోర్టులు, ఐడీ కార్డుల ఆధారంగా దీన్ని అమలు చేస్తున్నట్టు సుప్రీమ్ పీపుల్స్ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చీఫ్ మెంగ్ జియాంగ్ చెబుతున్నాడు.
మరో 71 వేల మందిని ఎగవేతదారులు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులుగా, ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేయకుండా ఆదేశాలు జారీ చేశారు. 5.5 లక్షల మంది రుణఎగవేతదారుల క్రెడిట్ కార్డుల దరఖాస్తులను ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా చెత్తబుట్టలో పారేసింది.
ప్రభుత్వ సిబ్బంది, రాజకీయ సలహా కమిటీల సబ్యులు, స్థానిక లెజిస్టేటివ్ సభ్యులు, చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ డెలిగేట్స్ విషయంలోనూ ఎలాంటి మినహాయింపులు ఇవ్వవద్దని సుప్రీం ఆదేశించింది. దీంతో కొందరిని బహిష్కరించారు, కొందరిని డిమోట్ చేశారు. కనీసం పది లక్షల మంది దీంతో బెదిరిపోయి, రుణాలు చెల్లించటానికి సిద్దపడుతున్నారట. నరేంద్ర మోడీ ప్రభుత్వం సహితం ఇటువంటి చర్యలు తీసుకోవటం గురించి ఆలోచించగలదా ?