ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)తో తన బంధాన్ని పూర్తిగా తెంచుకోనున్నాడు రాహుల్ ద్రవిడ్. ఆటగాడిగా ఎప్పుడో రిటైరైనా ప్రస్తుతం అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు. అయితే అటు ఇండియా ఎ, అండర్ 19 టీమ్స్‌కు కోచ్‌గా ఉంటూ, ఇటు ఐపీఎల్‌తో ఒప్పందం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందికే వస్తుందని సీఓఏకు ఈ మధ్యే రిజైన్ చేసిన రామచంద్ర గుహ ఆరోపించిన విషయం తెలిసిందే.
దీనిపై ద్రవిడ్ సీఓఏకు లేఖ కూడా రాశాడు. దానికి దారి తీసిన పరిస్థితులను ఆ లేఖలో ద్రవిడ్ వివరించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం తాను పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఉల్లంఘనకు పాల్పడలేదని స్పష్టంచేశాడు. తన కాంట్రాక్ట్ మధ్యలో ఉన్నపుడు బోర్డు రూల్స్ మార్చిందేమో తనకు తెలియదని, అలా చేస్తే అది బోర్డు తప్పవుతుంది కానీ తనది కాదని ద్రవిడ్ అన్నాడు.
మరోవైపు ద్రవిడ్‌తో ఒప్పందాన్ని మరో 12 నెలల కాలం కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. అలా అయితే ద్రవిడ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ మెంటార్ పదవికి రాజీనామా చేయక తప్పదు.
ద్రవిడ్ గతంలో 10 నెలల కాలానికి బీసీసీఐ నుంచి రూ.4 కోట్లు వసూలు చేశాడు. అటు ఢిల్లీ టీమ్ కూడా అంతే మొత్తం ద్రవిడ్‌కు ఇచ్చింది. ఇప్పుడు ఆ పదవిని వదులుకోనుండటంతో ద్రవిడ్ కాస్త ఎక్కువ మొత్తాన్నే కోచ్ పదవికి డిమాండ్ చేయనున్నాడు. తాము భరించగలిగినంత మొత్తాన్నే ద్రవిడ్ డిమాండ్ చేస్తాడని ఆశిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అటు ఐపీఎల్ కాంట్రాక్ట్ పోనుండటంతో ఆ మేరకు అతనికి నష్టం కలగకుండా కూడా చూస్తామని బోర్డు స్పష్టంచేసింది.