అమెరికాలో జాత్యహంకారం మళ్లీ భగ్గుమంది. వర్జీనియా రాష్ట్రంలో శనివారం శ్వేత జాతీయులు, నయా నాజీలు దాష్టికం ప్రదర్శించారు. వర్జీనియాకు 256 కిలోమీటర్ల దూరంలోని చార్లెట్స్విల్లే పట్టణంలో గల పార్కు నుండి జాతీయవాదానికి గుర్తుగా వున్న కాన్ఫెడరేట్ జనరల్ రాబర్ట్ ఇ లీ విగ్రహాన్ని తొలగించాలన్న స్థానిక కౌన్సిల్ ప్రయత్నాలకు నిరసిస్తూ శ్వేత జాతీయులు 'యునైట్ ది రైట్' పేరుతో ర్యాలీ నిర్వహించారు. వందల సంఖ్యలో శ్వేత జాతీయులు, నయా నాజీలు, కు క్లాక్స్ క్లాన్ సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ ర్యాలీని వ్యతిరేకిస్తున్న మరో గ్రూపు సభ్యులతో వీరు ఘర్షణ పడ్డారు. ఇక్కడ శ్వేత జాతీయులు సృష్టించిన బీభత్సంలో ఒక మహిళ (32) మరణించగా 19 మంది గాయపడ్డారు. శ్వేత జాతీయుల ర్యాలీని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు జరుపుతున్న నిరసనల్లో ఆ మహిళ పాల్గొంది. అయితే ఆ మహిళ ఎవరో ఏమిటో పేరు ఇంతవరకు వెల్లడించలేదు. శ్వేత జాతీయులకు చెందిన వ్యక్తి ఆందోళనాకారులపైకి కారును అడ్డదిడ్డంగా పోనివ్వడంతో ఆ మహిళ మరణించింది. కాగా ఆ నిరసనల ప్రదేశానికి కాస్త దూరంలో గగనతలం నుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న హెలికాప్టర్ కూలి మరో ఇద్దరు మరణించారు.
దాడి జరిగిన వెంటనే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఘటనను ఖండించలేదు. కొన్ని గంటలు గడిచిన అనంతరం స్పందిస్తూ, ఈ సంఘటనను భయంకరమైనదిగా వ్యాఖ్యానించారు. విద్వేషం, వివక్ష, హింసను ఇలా ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని న్యూజెర్సీలోని గోల్డ్ రిసార్ట్లో ట్రంప్ విలేకర్లతో మాట్లాడుతూ, వ్యాఖ్యానించారు.
"ఈ తరహా హింస చాలాకాలం నుండి మన దేశంలో కొనసాగుతోంది. ట్రంప్, లేదా ఒబామా హయాంలో అని కాదు, సుదీర్ఘకాలంగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. అమెరికాలో ఈ తరహా పరిస్థి తులకు అవకాశమివ్వరాదు. తక్షణమే శాంతి భద్రతల పరిస్థితిని పునరుద్ధరిం చాల్సిన అవసరం వుంది. అమాయకులైన ప్రజల ప్రాణాలను కాపాడాల్సి వుంది'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మన సమాజంలో ఏ పౌరుడు కూడా భద్రత కోసం భయపడరాదని అన్నారు. ఏ పిల్లవాడు కూడా బయటకు వెళ్లి ఆడుకునేందుకు లేదా తల్లితండ్రులతో కలిసి తిరిగేందుకు భయపడే పరిస్థితులు వుండరాదని స్పష్టం చేశారు.