బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనానెహ్వాల్పై రియో ఒలింపిక్స్ రజతపతక విజేత పీవీ సింధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాడ్మింటన్ కోర్టు విషయానికి వస్తే తానూ సైనానెహ్వాల్ ప్రత్యర్థులమేనని, కానీ వ్యక్తిగత సంబంధాల గురించి ప్రశ్నిస్తే తాము స్నేహితులమేనని పీవీ సింధూ వ్యాఖ్యానించారు.
తామిద్దరి మధ్య ‘హాయ్-బై’ వంటి మాటలే తప్ప...తామిద్దరం శిక్షణలో ఉన్నందువల్ల ఇతర విషయాలు మాట్లాడుకోవటానికి అసలు సమయమే లేదని సింధూ పేర్కొన్నారు. మూడు సంవత్సరాల పాటు బెంగళూరులో ఒలింపియన్ విమల్ కుమార్ వద్ద శిక్షణ పొందిన సైనా నెహ్వాల్ హైదరాబాద్ లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమికి మారింది.
ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ప్రధాన జాతీయ కోచ్ గోపీచంద్ వద్ద ఏకకాలంలో శిక్షణ పొందుతున్నారు. ఆచరణలో ఇద్దరు బ్యాడ్మింటన్ ఛాంపియన్లు ప్రత్యర్థులుగా భావిస్తారా? అని ప్రశ్నిస్తే ‘‘తమ మధ్య పోటీ ఎల్లప్పుడూ ఉంటుంది. కోర్టులో ఆడుతున్నప్పుడు, ప్రతి ఒక్కరూ గెలవాలని కోరుకుంటారు’’ అని ప్రపంచ షట్లర్ సింధూ సమాధానమిచ్చారు.