నిన్న ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో అభిమానులకు మరో థ్రిల్లర్ అనుభూతిని కలిగిస్తూ ఢిల్లీపై చివరి బంతికి నాలుగు పరుగుల తేడాతో పంజాబ్ ఉత్కంఠ విజయాన్నందుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది.
కరుణ్ నాయర్ (32 బంతుల్లో 4 ఫోర్లతో 34), మిల్లర్ (19 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 26)తో పాటు రాహుల్ (15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 23) ఓ మాదిరిగా ఆడారు. ప్లంకెట్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. అయ్యర్ (45 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 57) ఒక్కడే పోరాడాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంకిత్ రాజ్‌పుత్‌కు దక్కింది.
తరువాత లక్ష ఛేదనలో పూర్తిగా ఢిల్లీ విఫలమైనది. ఛేదించాల్సింది స్వల్ప లక్ష్యమే అయినా ఢిల్లీ పూర్తిగా తడబడింది. ఓపెనర్ పృథ్వీషా తన అరంగేట్ర మ్యాచ్‌లో మెరిశాడు. క్రీజులో కొద్దిసేపే గడిపినా బౌండరీలతో చెలరేగాడు. 10 బంతుల్లో నాలుగు ఫోర్లతో 22 పరుగులు చేసి మూడో ఓవర్లో అవుటయ్యాడు. ఓ దశలో 76 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోగా శ్రేయాస్ అయ్యర్, తెవాటియా ఢిల్లీని కాసేపు ఆదుకున్నారు. 17వ ఓవర్లో తెవాటియా 6,4తో రాణించినా మరుసటి ఓవర్లో అవుటయ్యాడు. ఇక ఆఖరి ఓవర్లో 17 పరుగులు రావాల్సి ఉండగా శ్రేయాస్ 6,4 కొట్టినా చివరి బంతికి అవుటయ్యాడు.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కూడా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోయింది . గేల్ విశ్రాంతి కారణంగా దూరం కాగా పవర్‌ప్లేలో ఇప్పటిదాకా ఓవర్‌కు పది పరుగుల చొప్పున రాణించిన ఈ జట్టు ఈసారి రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేయగలిగింది. 15 ఓవర్లు ముగిసేసరికి 100 పరుగులు చేసిన పంజాబ్ డెత్ ఓవర్లలోనూ వేగం కనబరచలేకపోయింది. కరుణ్, మిల్లర్ వరుస ఓవర్లలో అవుట్ కావడంతో పాటు ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి నాలుగు పరుగులు చేసింది.