టీమిండియా బ్యాట్సమెన్ చతేశ్వర్ పుజారా బ్యాట్స్‌మన్ 4 వేల పరుగుల మైలురాయిని చేర్చుకోవటంతో పాటు మరో సెంచరీ చేశాడు.టెస్టుల్లో అతనికిది 13వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీ. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. 163 బంతుల్లో పుజారా సెంచరీ చేశాడు.
గాలె టెస్ట్‌లోనూ అతను సెంచరీ చేసిన విషయం తెలిసిందే. కెరీర్లో 50వ టెస్ట్ ఆడుతున్న పుజారా ఈ మ్యాచ్‌లోనే 4 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు 49 టెస్టుల్లో 3966 రన్స్‌తో ఉన్న చతేశ్వర్ 34 పరుగుల స్కోరు దగ్గర 4000 రన్స్ పూర్తి చేశాడు. అతనికిది 84వ ఇన్నింగ్స్.
దీంతో వేగంగా 4 వేల రన్స్ చేసిన ద్రవిడ్‌తో కలిసి రెండోస్థానంలో నిలిచాడు పుజారా. టెస్టుల్లో అతని సగటు 52కి పైనే ఉంది. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 206. మొత్తం 13 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు చేశాడు. ఏడాది కాలంగా టాప్ ఫామ్‌లో ఉన్న పుజారా టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అటు అజింక్య రహానే కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో టీమ్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. రహానేకు టెస్టుల్లో ఇది 13వ హాఫ్ సెంచరీ. 8 సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. పుజారా, రహానే ఇప్పటికే నాలుగో వికెట్‌కు వందకు పైగా పార్ట్నర్షిప్ నమోదు చేశారు.