గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల (డిఫాల్టర్) బకాయిలు మరింత పెరిగాయి. ఈ ఏడాది మార్చి చివరినాటికి దాదాపు 9 వేల మంది డిఫాల్టర్లు పీఎస్బీలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.92,376 కోట్లకు చేరుకున్నాయి. మార్చి 2016 చివరికల్లా డిఫాల్టర్ల బకాయిలు రూ.76,685 కోట్లుగా ఉన్నాయి. ఏడాదికాలంలో డిఫాల్టర్ల సంఖ్య 10 శాతం మేర పెరుగగా, వారి బకాయిలు 20.4 శాతం పెరిగాయి.
ఆర్థిక శాఖ వద్దనున్న సమాచారం ప్రకారం గత ఏడాది మార్చిలో పీఎస్బీలకు రుణం ఎగవేసిన వారి సంఖ్య 8,167గా ఉండగా, ఈ ఏడాది అదే నెలలో 8,915కు చేరుకుంది. వీరిలో 1,914 మంది చెల్లించాల్సిన రూ.32,484 కోట్ల బకాయిలకు సంబంధించి బ్యాంకులు ఇప్పటికే కేసులు కూడా ఫైల్ చేశాయి. దేశంలో ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులతోపాటు మిగతా పీఎస్బీలన్నీ కలిసి 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.81,683 కోట్ల రుణ బకాయిలను రద్దు చేశాయి.
గడిచిన ఐదేళ్లలో రద్దు చేసిన బకాయిల్లో ఇదే అతిపెద్ద మొత్తం. 2015-16తో పోలిస్తే 41 శాతం అధిక బకాయిలను రద్దు చేశాయి. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ, దానిలో విలీనమైన అనుబంధ బ్యాంకులే గతసారి రూ.27,574 కోట్ల బకాయిలను రద్దు చేశాయి. కాగా, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల పేర్లు, ఫొటో, ఇతర వివరాలతో పత్రికల్లో ప్రకటనలు జారీ చేయడం ద్వారా వారిని పరువును బజారుకీడ్చేందుకు సైతం ఆర్బీఐ బ్యాంకులకు అనుమతిచ్చింది.